తెలుగు జాతికి మణిహారం నందమూరి తరాకరామారావు !

Seetha Sailaja
‘అందరికీ తెలిసేలా కొందరే పుడతారు’ అనే మాటలను నిజం చేస్తూ 1923 మే 28న నిమ్మకూరులో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబలో పుట్టిన నందమూరి తారకరామారావు భవిష్యత్ లో తెలుగు జాతిని శాసిస్తాడు అని ఆనాడు ఆయన తల్లితండ్రులు అనుకుని ఉండరు. అటువంటి మహావ్యక్తి జన్మించి నేటికి 93 సంవత్సరాలు పూర్తి అయింది. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు దాటిపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడి హృదయంలో ఇప్పటికీ ఆయన చిరంజీవిగా మిగిలి ఉన్నాడు అంటే తెలుగు జాతిని ఆయన ఏ విధంగా ప్రభావితం చేసాడో అర్ధం అవుతుంది. 

రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఎన్‌టిఆర్‌. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు నందమూరి తారక రామారావు. ఎన్‌టిఆర్‌కు మొదటి నుంచి నాటక రంగంపై మక్కువ ఎక్కువ ఉండటంతో సినిమాల పై ఉన్న మోజుతో ఆ రోజులలో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేస్తున్నా ఆ ఉద్యోగాన్ని వదులుకుని చెన్నైలో అడుగుపెట్టి  మొదట్లో సినిమాలలో చిన్నచిన్న పాత్రలు వేసిన ఎన్టీఆర్ నటుడుగా మారింది విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం లాంటి సినిమాల ద్వారా మాత్రమే. ఆతరువాత వచ్చిన  మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ లాంటి చిత్రాలు ఎన్‌టిరామారావును తెలుగువారి గుండెలలో దేవుడుగా మార్చడమే  కాకుండా ఆయనను ‘భగవంతుడుగా ఆరాధిస్తూ పూజలు’ చేసే స్థాయికి తీసుకు వెళ్ళి తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. 

కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్‌ రాముడు, సర్ధార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటన మాస్ ప్రేక్షకులకు కూడ చేరువవ్వడంతో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఎన్‌టిఆర్‌ చేత 320కి పైగా సినిమాలలో నటించేలా చేసింది. తెలుగు సినిమా రంగంలో ఆ రోజులలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటున్న సమయంలోనే తృణప్రాయంగా సినిమా కెరియర్ ను వదులుకుని రాజకీయాలలోకి రావడమే కాకుండా ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన నందమూరి తారకరామారావు క్రియేట్ చేసిన పొలిటికల్ రికార్డును ఇప్పటి వరకు భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడు బ్రేక్ చేయలేకపోయారు. 

‘తెలుగువాడి ఆత్మగౌరవం’ పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేసిన ఎన్టీఆర్ ప్రచార సరళిని ఇప్పటికీ అనేక పార్టీలు అనుసరిస్తూనే ఉన్నాయి. పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలను రూపొందించి ఆయన అధికారంలో ఉన్నంత కాలం పేదవారి కోసం ఎదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు. నటన కావచ్చు రాజకీయం కావచ్చు ఆయన ఎన్నుకున్న ఏ రంగంలో అయినా పరాజయాన్ని ఆయన సహించరు విజయం వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటారు ఎన్టీఆర్.

సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కు ఏడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఎన్టీఆర్ హయంలో ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితం పై ప్రత్యర్ధులు కూడ ఆరోపణలు చేయలేకపోయారు అంటే ఎన్టీఆర్ ఎంత నిజయితీగా పరిపాలన చేసాడో అర్ధం అవుతుంది. ఆయన 1994 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత తన సొంత పార్టీ ఎమ్.ఎల్.ఎ ల వ్యతిరేకతతో తన సొంత కుటుంబ సభ్యుల వెన్ను పోటుతో అధికారాన్ని పోగొట్టుకున్న ఎన్టీఆర్ చివరి రోజులలో మాత్రం చాల నిరాశగా జీవించారు అని ఆయన సన్నిహితులు చెపుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నందమూరి తరకరామారావుని తెలుగు జాతి ఉన్నంత కాలం మరిచిపోరు అన్నది ఒక చారిత్రక సత్యం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: