అంచనాలు పెంచేస్తోన్న బన్నీ సినిమా!
అల్లుఅర్జున్ మరో హిట్‌కి రంగం సిద్ధం చేసుకొంటున్నాడా? ఇద్దరమ్మాయిలతో సినిమాకి వస్తున్న హైప్ చూస్తోంటే అలాగే అనిపిస్తోంది. జులాయి సినిమాతో ఓ నికార్సయిన హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు.. బన్నీ. వరుసగా రెండో హిట్ సొంతం చేసుకోవడం ఖాయమని ఫిల్మ్‌నగర్‌లో పెద్దలు జోస్యం చెబుతున్నారు. ఈసినిమాలో బన్నీ స్టెప్పులు, ఫైట్లూ మాస్‌కి తెగ నచ్చేస్తాయట. పైగా... పూరి బన్నీని చూపించిన విధానం తప్పకుండా అందరినీ ఆకట్టుకొంటుందని చెబుతున్నారు.
పూరి కూడా ఈసినిమా చాలా కసిగా చేశాడట. వరుస పరాజయాలకు ఈ సినిమాతో పుల్‌స్టాప్ పెట్టాలని పూరి కంకణం కట్టుకొన్నాడు. అందుకే ప్రతి పాత్రపై శ్రద్ద పెట్టాడు. పూరి సినిమాల్లో అలీ పాత్ర బాగా క్లిక్ అవుతుంది. ఈసారి బ్రహ్మానందం పాత్ర కూడా అదే రేంజులో పండిందట. ఇవన్నీ తన సినిమాకి ప్లస్ అని పూరి నమ్ముతున్నాడు. ఓవర్సీస్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఇక్కడా అదే రేంజు పలుకుతోంది.
మొత్తానికి.... ఓ హిట్ కి ఫ్లాట్ ఫామ్ సిద్ధమవుతున్నట్టే అనిపిస్తోంది.