సోషల్ మీడియాపై “మా” ఏం చేయబోతోందో తెలిస్తే షాక్..!

Vasishta

సినిమా స్టార్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యుద్ధం ప్రకటించింది. వెబ్ సైట్స్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో సెలబ్రిటీలను కించపరుస్తూ రాస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేయాలని మా డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తోంది.


          ఇప్పుడు సోషల్ మీడియా శకం నడుస్తోంది. ఏదైనా సంఘటన జరిగితే చాలు దానికి సంబంధించి వివిధ కోణాల్లో వార్తలు సోషల్ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఇక సెలబ్రిటీల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరిపైనా వార్తలు రాసేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వార్తలు తారలపై బురదజల్లేలా ఉంటున్నాయి.


          సినిమా స్టార్స్ పై గాసిప్స్ చాలా కామన్. అయితే ఇప్పుడు ఎవరికివారు గాసిప్స్ పేరిట ఏవేవో పిచ్చిరాతలు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తలపై తారలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు, అభిమానులు కూడా ఆ వార్తలను నిజమేనేమో అని నమ్మేంతగా ఆ వార్తలు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.


          “మా”లో సభ్యత్వం కలిగిన చాలా మంది.. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై ఏదైనా చర్యలు తీసుకోవాలని మా భావించింది. దీనికి సంబంధించి బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ ను ఆర్టీఐ ద్వారా సంప్రదిస్తే ఇది తమ పరిధిలోకి రాదని, సైబర్ పోలీసులను ఆశ్రయించాలని కోరింది. అక్కడ అభ్యర్థించినా ... ఇలాంటివాటిపై తన నియంత్రణ ఉండబోదని తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార శాఖను సంప్రదించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భావిస్తోంది.


          సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సినిమా తారల జీవితాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని మా మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు. ఇలాంటి వాటిపై నియంత్రణ లేకపోతే మున్ముందు మరిన్ని విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: