‘గరుడవేగ’కు ఊహించని చిక్కులు..! రాజశేఖర్ కు షాక్..!!

Vasishta

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గరుడవేగ. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు చాలా కాలం తర్వాత రాజశేఖర్ కు మంచి పేరుకూడా తీసుకొచ్చింది. రిలీజైన చాన్నాళ్లకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. దీంతో సినిమా యూనిట్ కంగారు పడుతోంది.


          రాజశేఖర్ హీరోగా ప్రవీణ సత్తారు రూపొందించిన సినిమా గరుడవేగ. రాజశేఖర్ కు చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చిన సినిమా ఇది. యురేనియం మైనింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కడప జిల్లా తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం నిక్షేపాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఆటామిక్ కార్పొరేషన్ అధికారులు, పలువురు ఇతర అధికారులు కలిసి పక్కదారి పట్టించిన రహస్యాన్ని హీరో ఛేదించడం ఈ సినిమా స్టోరీ. అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగే ఈ కథ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా ఇకపై ప్రదర్శించకూడదంటూ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


          గరుడవేగ సినిమా తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందంటూ ఆటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ కు చెందిన యురేనియం కార్పొరేషన్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఫిర్యాదుదారులతో ఏకీభవించింది. ఇకపై ఈ సినిమాను ఎక్కడా ప్రదర్శించవద్దని ఆదేశాలిచ్చింది. టీవీలు, సినిమాహాళ్లు, యూట్యూబ్.. తదితర ఏ ఇతర మాధ్యమంలో కూడా ఇకపై ప్రదర్శంచకుండా తీర్పు చెప్పింది. అంతేకాదు.. దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు కూడా పెట్టొద్దని చెప్పింది.


          మంచి పేరు తెచ్చిన సినిమా ఆర్థాంతరంగా ఇలా ఎక్కడా ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు రావడంపై సినిమా యూనిట్ కంగారు పడుతోంది. తీర్పుపై సవాల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడడంతో ఆ లోపే రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉంది గరుడవేగ యూనిట్. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: