నిన్నరాత్రి భాగ్యనగరంలో జరిగిన ‘రంగస్థలం’ విజయోత్సవ సభలో ఎవరూ ఊహించని దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చరణ్ ను బహిరంగంగా పొగడని పవన్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరో అయ్యే లక్షణాలు ఉన్న హీరో చరణ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘రంగస్థలం’ మూవీ ఆస్కార్ అవార్డ్ ప్యానల్ కు ఎంపిక కావలసిన లక్షణాలు ఉన్న సినిమా అనీ ఎదిగిన కొద్ది ఒదిగే మనస్తత్వం తాను చరణ్ లో చూస్తున్నాను అంటూ పవన్ చరణ్ పై మితిమీరిన ప్రశంసలు కురిపించాడు.
ఇదే సందర్భంలో పవన్ మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు చరణ్ తమ్ముడు లాంటి వాడనీ చిరంజీవి తనకు తండ్రి అనిఅంటూ తమ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుభందాన్ని ఉద్వేగ పూరితంగా బయటపెట్టాడు. ఈ ఫంక్షన్ జరుగుతున్న ప్రాంగణంలోకి పవన్ రాగానే చరణ్ ఎదురు వెళ్ళి పవన్ కు పాదనమస్కారం చేయడం అదేవిధంగా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవన్ మాటలకు ఉద్వేగానికి లోనై మళ్ళీ మరొకసారి పవన్ కాళ్ళకు చరణ్ మరొకసారి పాద నమస్కారం చేయడం ఈ కార్యక్రమానికి హైలెట్.
చరణ్ తనపట్ల చూపుతున్న విధేయతకు మరిసిపోయిన పవన్ చరణ్ కు ముద్దులు పెట్టడం దానికి ప్రతిగా చరణ్ పవన్ కు కూడా ముద్దులు పెట్టడంతో వీరిద్దరి ముద్దులవేదికగా ‘రంగస్థలం’ విజయోత్సవ సభ మారిపోయింది. ఇదేసందర్భంలో పవన్ మాట్లాడుతూ ‘బాహుబలి’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరించినట్లుగా అలాగే ‘రంగస్థలం’ ను కూడ ఆదరించమని అడగడం మరో ట్విస్ట్.
సినిమా రంగంలో రాజకీయాలు ఉండవు అనిఅంటూ సినిమా వారందరిది ఒకేపార్టీ అంటూ పవన్ చేసిన కామెంట్స్ తో తన ‘జనసేన’ కు ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి అన్న అర్ధాలు అంతర్లీనంగా కనిపించాయి. గతంలో చిరంజీవి పవన్ గురించి మాట్లాడుతూ ‘తమ అన్న దమ్ముల మధ్య మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే’ అన్న మాటలను అక్షరాల నిజం చేస్తూ పవన్ మార్చిన తన వ్యూహంతో చరణ్ ను ప్రశంసలతో ముంచేత్తివేస్తూ మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్ మాత్రమే అన్న స్పష్టమైన సంకేతాలను పవన్ నిన్న ‘రంగస్థలం’ సక్సస్ మీట్ లో ఇచ్చాడు..