తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని తీస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి చిరకాల స్వప్నం అయిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరు పుట్టిన రోజుకి ఒక్కరోజు ముందు ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ‘సైరా’ టీజర్ రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది. అంతే కాదు ఈ చిత్రంలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నట్లు పరుచూరి బ్రదర్స్ టీజర్ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పారు.
‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ లో ‘ఈ యుద్ధం ఎవరిది’ అని చిరు అంటే అతడి సైన్యం ‘మనది’ అంటుంది. అంతే బ్రిటీష్ ప్రభుత్వం పై ఏ రేంజ్ లో సమరశంఖారావం పూరించారో అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే..చిత్ర రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా నుంచి చాలా ముందుగానే ఒక కీలకమైన డైలాగ్ లీక్ చేయడం విశేషం. ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది.
ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’’ అని బ్రిటిష్ అధికారి అంటే.. ‘‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని. చావంటే నాకెందుకురా భయం’’ అని చిరు డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలుతాయో అర్థం అవుతుంది. అయితే ఈ చిన్న డైలాగ్ అభిమానుల కోసం లీక్ చేశానని.. ఇందుకు చిరంజీవిగారు కోప్పడతారేమో తెలియదని పరుచూరి చెప్పడం విశేషం.
ఈ సినిమా కోసం 12 ఏళ్లు ఆగామని.. సురేందర్రెడ్డిలాంటి అద్భుతమైన దర్శకుడు దొరకడం.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబులాంటి మంచి నటులు సమకూరడంతో సినిమా గొప్పగా తయారవుతోందని ఆయన చెప్పారు.