సినీ, టివి నటి ఆత్మహత్య
వెండి తెరపై, బుల్లితెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి తమకు ఛాన్స్ వస్తే తామేంటో నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అదృష్టం తలుపు తట్టి బుల్లితెర, వెండి తెరపై చిన్న ఛాన్స్ వస్తే తాము గొప్ప సెలబ్రెటీల్లా సంతోష పడుతుంటారు. రంగుల ప్రపంచంలో వెలిగిపోదామని గంపెడాశతో నటానరంగంలోకి అడుగు పెట్టిన కొందరి జీవితాలు సగంలోనే అంతరించిపోతున్నాయి. నటన కోసమని వచ్చి మోసపోయేవారు ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
ఈ మద్య టివి నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ సినీ, టీవీ నటి యషిక ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. గతంలో వడపళనిలోని ఓ హాస్టల్లో ఉండే యషిక పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.
ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజలు క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు యషిక ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పలు సీరియళ్లలో నటించిన యషిక మన్నార్ వగెరా సినిమాలో నటించింది.