‘టీఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017,2018 సంవత్సరాలకు ‘టీఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ, నాగార్జునలకు టీఎస్‌ఆర్ జాతీయ అవార్డులు ప్రకటించారు. 2017 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి), 2018 సంవత్సరానికి గానూ నాగార్జున (దేవదాస్) ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 2017, 2018 సంవత్సరాలకు గాను విజేతల పేర్లు ప్రకటించారు. ‘‘నాలుగేళ్లుగా ఈ పురస్కారాల్ని అందిస్తున్నాం. ఈ ఆదివారం విశాఖపట్నంలో పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించి పురస్కారాల్ని అందిస్తున్నాం. మహానటి, రంగస్థలం, గౌతమిపుత్ర శాతకర్ణి.. ఇలా మంచి చిత్రాలకే పురస్కారాలు అందాయి. శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డుల్ని ఇస్తున్నాం.
ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు.
జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు.‘‘అవార్డు జ్యూరీలో నేను సభ్యురాల్ని. ఈసారి నాకు జీవన సాఫల్య పురస్కారం కూడా లభించింది. నటిగా నా కెరీర్ ఆగిపోలేదు. ఇప్పుడో చిత్రంలో నటిస్తున్నా’’ అని చెప్పారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లం దరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం.
కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’అన్నారు.‘‘కళాకారుల్నిగౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారిని చూసి నేర్చుకోవాల’’న్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు డా.శోభన కామినేని, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.