ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!

Edari Rama Krishna
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురి కాగా గురువారం ఉదయం ఆయనను  కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వెంటిటేలర్ పై ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ విషమంగా ఉందని తెలిపిన విషయం తెలిసిందే.  తాజాగా కోడీ రామకృష్ణ చికిత్స పొందుతూ కన్నుమూశారు.  కోడి రామకృష్ణ మరణ వార్త వినగానే టాలీవుడ్ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది.  ఎంతో మంది స్టార్ హీరోలకు దర్శకత్వం వహించిన కోడీ రామకృష్ణ కాలం చేయడం పలువురు నటీ,నటులు జీర్ణించుకోలేక పోతున్నారు. 

రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు.  తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు. కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ.   ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు.

పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది.దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు.

దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు.  వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే.  2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వ వహించలేదు.

ఫాంటసీ చిత్రాలను కూడా తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి సినిమాలే అందుకు ఉదాహరణ. మువ్వ గోపాలుడు, పెళ్లి, శత్రువు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కోడి రామకృష్ణ తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరీర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్‌ని కొనసాగించారు. కోడీ రామకృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: