రియల్ స్టార్ శ్రీహరి నటనను ఇష్టపడనివారు ఉండరు. చిన్న చిన్న వేషాలు వేస్తూ తన స్వయం కృషితో టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటుడిగా ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. ఎటువంటి వివాదాలలోను తల దూర్చకుండా అందరికీ అభిమాన పాత్రుడిగా ఉండే శ్రీహరి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు హడావుడి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈమధ్య శ్రీహరి తన బాడీ కి భిన్నంగా చాలా సన్నబడడం ఒక కారణం అయితే ఈమధ్యనే జరిగిన ‘తూఫాన్’ ఆడియో వేడుకలో ఆయన చాలా డల్ గా కనిపించడం ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసింది. ‘తూఫాన్’ ఆడియోలో శ్రీహరి రూపాన్ని చూసిన వారంతా షాక్ అవ్వడమే కాకుండా ఆయన ఆరోగ్యానికి ఏమైంది అని మాట్లాడుకోవడం వినిపించింది. అదేవిధంగా ఈమధ్య శ్రీహరి ఒప్పుకుంటున్న కొత్త సినిమాలు కూడా కనిపించకపోవడంతో కొన్ని వార్తలు పుట్టుకువస్తున్నాయి.
కొన్ని మీడియా వర్గాలలో శ్రీహరికి జాండీస్ వచ్చిందని కొందరు వార్తలు రాస్తూ ఉంటే, మరికొందరు మరేదో అనారోగ్యం శ్రీహరికి వచ్చింది అంటూ వార్తలు కనబడుతున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియదు కాని ఈ వార్తలు కేవలం గాలి వార్తలుగానే మిగిలిపోవాలని శ్రీహరి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో సినిమాలలో కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఆ మధ్య శ్రీహరి రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు శ్రీహరి చూస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో శ్రీహరి జగన్ పార్టీ లో చేరుతాడు అని అనుకున్నారు అంతా. కాని తాను కాంగ్రెస్ లోనే ఉంటానని శ్రీహరి ప్రకటించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఏది ఏమైనా శ్రీహరి పై వస్తున్న ఈ వార్తలు గాలి వార్తలుగా తెలిపోయి ఆయన మళ్ళీ బిజీ యాక్టర్ గా కొనసాగాలని ఆకాంక్షిద్దాం.