‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తో రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్ పార్టీ అధినేతలకు ఎంత సన్నిహితంగా మారిపోయాడు అన్న విషయం ఈరోజు మరొకసారి రుజువైంది. ఈరోజు ఉదయం తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జగన్ అనుచర బృదంలో వర్మ కూడ కనిపించడంతో మీడియా ఛానల్స్ అన్నీ వర్మ కామెంట్స్ గురించి ప్రశ్నించే ప్రయత్నాలు చేసాయి.
తనకు ఎదురైనా మీడియా ప్రతినిదులతో వర్మ మాట్లాడుతూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రకటన తాను తిరుపతి నుంచి చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆసినిమాకు వెంకన్న ఆశిస్సులు లభించడంతో తాను మళ్ళీ ఈరోజు ఉదయం వెంకటేశ్వరస్వామి ఆశిస్సుల కోసం వచ్చిన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ తాను తీయబోతున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు కూడ వెంకన్న ఆశీస్సులు కావాలని తాను ప్రార్ధించిన విషయాన్ని బయటపెట్టాడు.
ఇదే సందర్భంలో వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ మోహన్ రెడ్డికి అన్ని విషయాలలోనూ విజయం కలగాలని కోరుతూ తాను వెంకన్నకు మొక్కుకున్న మొక్కులు కూడ వివరించాడు. దీనితో దేవుడు అంటే నమ్మకంలేని వర్మకు ఒక విధంగా వైఎస్ఆర్ పార్టీ సాన్నిహిత్యంతో వర్మ దేవుడుకి భక్తుడుగా మారిపోతున్నాడు అనుకోవాలి.
జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే వర్మ తాను తీయబోతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ విషయంలో చాల పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికలు అయిపోయి ఒక ప్రశాంత వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతున్న పరిస్థుతులలో ఇలా కులాల మధ్య చిచ్చును రేపే టైటిల్ ను పెట్టుకుని వర్మ ఎందుకు సినిమా తీస్తున్నాడు అన్నది ఎవరి ఊహాలకు అందని విషయంగా మారింది..