అల్లు అర్జున్ కు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక సెంటిమెంట్ ఇప్పుడు త్రివిక్రమ్ కు టార్చర్ గా మారింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన నుంచి సినిమా లేకుండా ఏ ఒక్క సంవత్సరం ముగించలేదు.
దీనితో ఈ సంవత్సరం తన వైపు నుండి సినిమా ఉండి తీరాలి అన్న పట్టుదల బన్నీకి రావాడంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే దీనికి భిన్నంగా త్రివిక్రమ్ ఈసినిమా పనులను నెమ్మదిగా కొనసాగిస్తూ ఉండటం బన్నీకి ఏమాత్రం నచ్చడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఇలా త్రివిక్రమ్ వ్యవహరించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఈమూవీని వేగంగా పూర్తి చేసినా దసరాకి విడుదల చేసే ఆస్కారం లేదు. ఆ సీజన్ కు ‘సైరా’ లాక్ చేసారు. ఆతరువాత వచ్చే దీపావళి పెద్ద పండుగ అయినప్పటికీ అమావాస్య సెంటిమెంట్ తో తెలుగు సినిమాలు దీపావళికి రావు.
దీనితో ఒక్క డిసెంబర్ మినహా మరి ఏ నెల ఖాళీ లేకపోవడంతో ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దాము అని త్రివిక్రమ్ చెపుతున్నా బన్నీ మాత్రం ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే గతంలో ఒక్క నాగార్జునకు తప్ప మరి ఏహీరోల సినిమాలకు డిసెంబర్ కలిసిరాని నేపధ్యంలో డిసెంబర్ బదులు వచ్చే ఏడాది జనవరికి వెళదాము అని త్రివిక్రమ్ సూచిస్తున్నా బన్నీ మాత్రం డిసెంబర్ నెలను వదల వద్దని చెపుతున్నట్లుతెలుస్తోంది. దీనితో ఇది అంతా నిజంగా బన్నీకి ఉన్న సెంటిమెంట్ అనుకోవాలా లేదంటే సంక్రాంతికి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల ఉంది కాబట్టి అల్లు అర్జున్ ముందు చూపుతో జాగ్రత్తగా ఉన్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..