టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గురించి ముందుగా చెప్పుకోవాలంటే ఆయన పోషించిన విలన్ పాత్రలే మన కళ్లముందు కదలాడుతుంటాయి. ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన విలన్ పాత్రల ద్వారా ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ తరం విలన్లకు ఆయన ఓ మార్గదర్శి, దిక్సూచి కూడా. సాంఘిక .. చారిత్రక .. పౌరాణిక .. జానపద చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు.
తాజాగా ఆయన ఓ వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్కు, ఆయనకు మధ్య వచ్చిన గ్యాప్ గురించి చెప్పారు. కైకాల కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ ఆయనను ఎంతో గౌరవించే వారు అట. కైకాల ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయడంతో పాటు విలన్ పాత్రల్లో ఎన్టీఆర్కు ధీటుగా నటించడంతో ఆయనపై నమ్మకంతో బలమైన పాత్రలను ఇచ్చేలా చేసేవారట.
ఫలానా పాత్ర కైకాల బాగా చేస్తారు అని ఎన్టీఆర్ తనకు ఎంతో ప్రయార్టీ ఇచ్చేవారన్న కైకాల తనను ఒక తమ్ముడి కంటే ఎక్కువుగా చూసుకునే వారని అన్నారు. అయితే కొందరు వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు కైకాలపై ఎన్టీఆర్కు లేనిపోని మాటలు చెప్పారట. దీంతో ఎన్టీఆర్ మనస్సును కష్టపెట్టానని భావించిన కైకాల తర్వాత ఆయన్ను కలిసి ఆయన విన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారట.
ఆ తర్వాత తనపై రాంగ్ మాటలు చెప్పిన వ్యక్తులను ఎన్టీఆర్ పిలిపించడంతో ...వాళ్లు మాట మార్చడంతో అసలు విషయం తెలుసుకున్నారట. ఆ టైంలో ఎన్టీఆర్ తనకు సారి చెప్పారని... అలాంటి గొప్ప వ్యక్తి అని కైకాల ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు.