టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్ హీరోగా సినిమాలు చేయడంతో పాటు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు కూడా తీస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా తన తండ్రి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తీసిన చెర్రీ ఇక ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా నరసింహారెడ్డి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా రూపొందుతోంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఉయ్యాలవాడ కుటుంబీకులతో ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ముందుగా ఈ సినిమా ప్రారంభించేటప్పుడు కనీసం తమను సంప్రదించలేదని వారు ఆందోళన చేశారు. ఇక ఇప్పుడు వారు వివాదం లేవనెత్తారు.
తమ యోధుడి కథను అయాచితంగా సినిమా కథగా ఉపయోగించుకుంటూ, ఆయన పేరుతో మార్కెటింగ్ చేసుకుంటూ.. మరోవైపు తమ ప్రాంతంలో షూటింగ్ జరిపి, పంట నష్ట పరిహారాలు చెల్లించలేదని వారు వాపోయారు. ఈ క్రమంలోనే వారు చెర్రీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమ పంట పొలాల్లో షూటింగ్ చేసేటప్పుడు నష్టపోయిన పంటకు పరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకుని ఇప్పుడు ఇవ్వలేదని వారు వాపోయారు.
ఒక చారిత్రాత్మక సినిమా తీసేటప్పుడు చెర్రీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడకుండా ఉండడం మంచిదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఉయ్యాలవాడ కుటుంబీకులు అయితే చెర్రీపై విమర్శలు కూడా చేస్తున్నారు. మరి దీనిపై మనోడు ఎలా స్పందిస్తాడో ? చూడాలి.