భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ‘ఓ బేబి’ ని నాగచైతన్య సెంటిమెంట్ వెంటాడుతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తాము తీసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని విడుదలకు ముందు కొందరు కడప దర్గాకు వెళ్ళి ప్రార్ధనలు చేస్తే మరికొందరు తిరుపతి వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు మొక్కుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సెంటిమెంట్.
వాస్తవానికి సమంత క్రిష్టియన్ అయితే నాగచైతన్యను పెళ్ళి చేసుకున్న తరువాత ఆమెకు హిందువుల దేవుళ్ళ పై నమ్మకాలు బాగా పెరిగాయి. దీనితో చైతన్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన ‘మజిలీ’ విడుదలకు ముందు సమంత ఏడు కొండలు కాలినడకన ఎక్కి ‘మజిలీ’ విజయం కోసం మొక్కులు మొక్కుకుంది.
ఆమె కోరికలను శ్రీవెంకటేశ్వర స్వామి తీర్చడంతో ఆమెకు ఆ ఏడుకొండల వాడి పై మరింత నమ్మకం పెరిగి ఇప్పుడు ఈవారం విడుదల కాబోతున్న ‘ఓ బేబి’ కోసం తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకొని ప్రార్దనలు చేసింది. దర్శకురాలు నందినీ రెడ్డితో పాటు ఈమూవీ నిర్మాణంలో పాల్గొన్న అనేకమంది సాంకేతిక నిపుణులు కూడ సమంతతో తిరుపతి వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించిన ఫోటోలను ఈమూవీ యూనిట్ విడుదల చేసింది. దీనితో సమంత ‘ఓ బేబి’ కోసం ‘మజిలీ’ సెంటిమెంట్ ను కొనసాగిస్తుందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. సమంత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీల కలక్షన్స్ కు ‘ఓ బేబి’ ఒక పరీక్షగా మారిన నేపధ్యంలో మూవీ రిజల్ట్ గురించి అందరు ఎదురు చూస్తున్నారు..