మహానటి సావిత్రి ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అనుకోని పరిస్థితుల్లో కోమాలోకి చేరి నరకం చవిచూసి తనువుచాలించింది. మరి అందాల తార శ్రీదేవి బాత్‌టబ్‌లో మరణించింది. నిజంగానే అడుగు లోతులో ఉన్న నీటిటబ్‌లో తల మునిగి ఊపిరాడక చనిపోతారా! అనేది మాత్రం ఎందరో అభిమానుల సందేహం. సాక్షాత్తూ ఓ రాష్ట్ర డీజీపీ అంటే.. నేర పరిశోధనలో అపార అనుభవం ఉన్న పోలీసు అధికారికీ ఇటువంటి అనుమానమే వచ్చింది. దీనికి కౌంటర్‌గా బోనీకపూర్ మూర్కులతో నాకు సంబంధం లేదని తప్పించుకోవచ్చు. దుబాయ్‌లో పోలీసు యంత్రాంగం ఇదంతా తమకెందుకనీ చేతులు దులుపుకోనూ వచ్చు. అయినా అభిమానులు ముఖ్యంగా భారతీయుల మదిలో అది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇవి కేవలం సావిత్రి, శ్రీదేవితోనే కాదు.. అప్పట్లో ఫటాఫట్ జయలక్ష్మి అనే వ్యాంప్ క్యారెక్టర్ ఆత్మహత్య సంచలనం. ఆ తరువాత దివ్యభారతి..
బొబ్బిలిరాజా సినిమాతో తెరమీదకు వచ్చిన భామ కొద్ది కాలంలోనే తెలుగు, హిందీ భాషల్లో సీనియర్లతో నటించి ఔరా అనిపించింది. ఒకరోజు ఐదో అంతస్తు భవనం పై నుంచి కిందపడి చనిపోయింది. భర్త సాజిద్ నదియావాలా దీనికి కారణమని ఆరోపణలు వచ్చాయి. కాదు మద్యం మత్తులో ఆమె కిందపడి మరణించిందంటూ కేసు మూసివేశారు. అది నిజమేనా! అంటే కాదు అని ఖచ్చితంగా చెప్పాలంటే దివ్యభారతి రావాలి. ఆమె ఎలాగూ రాదుకాబట్టి.. అదే నిజమని నమ్మాలి. సెక్స్ క్వీన్ గా ఎదిగిన సిల్క్‌స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు దీనికి కారణమని చెప్పినా చీకటికోణం మరోకటి ఉందనే ఊహాగానాలు లేకపోలేదు. ఆమె జీవితాన్ని డర్టీపిక్చర్ పేరిట సినిమా తీసి కోట్లు సంపాదించారు.
ఈ సినిమాతో విద్యాబాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. జియాఖాన్, ససీఫా జోసెఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ ఉదయ్‌కిరణ్, కునాల్ సింగ్, నాటి తరం నటుడు రంగనాథ్ వంటి నటీ నటులు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వారే.. కాలక్రమంలో అందాల తారలకు ఎదురైన అనుభవాలు. ఆత్మీయుల మోసాలు.. ఒంటరితనం వెరసి.. వారిని ఆత్మహత్యలకు పురిగొల్పాయి. కొందరి మరణాలు మాత్రం మిస్టరీగానే మిగిలాయి. అది డబ్బులతో ముడిపడ్డాయనే ఆరోపణలు ఉన్నా.. అవి నిజమా అని తేల్చేందుకు ఆధారాల్లేవు. కాబట్టి.. ఎవరి ఊహాలకు వారు అంచనా వేసుకునేందుకు వీలుంది.. కాదంటే.. మరో బయోపిక్ తీసి చేతులు కాల్చుకునేందుకు కోట్లు సంపాదించేందుకు మార్గమూ ఉంది.