రైటర్‌గా హీరోగా మంచి కథలను ఎన్నుకుంటూ ప్రతీ కథకు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకునే హీరో అడివి శేష్. గూఢాచారి మంచి హిట్ అయిన తర్వాత అమీతుమీ అది కూడా కామెడీ చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎవరుతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించారు.
గురువారం విడుదలైన ఈ చిత్రంలో రెజీనా, అడవిశేష్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. పీవీపీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. సినిమా విడుదలైనప్పటి నుంచీ మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ``సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఇన్ని మలుపులతో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురి చేసిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. కథగా చెబుతున్నప్పుడు ఈ తరహా సినిమాల్ని నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. కానీ సినిమా చూసినప్పుడు బాగా నచ్చుతాయి. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అడివి శేష్ కెరీర్‌లో క్రమంగా ఎదుగుతున్నాడు. మా సంస్థలో అతనితో సినిమా చేస్తాం. ప్రతిభ ఉంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేకుండానే రాణించవచ్చు. నటుడిగా అడివి శేష్ విజయాలే అందుకు నిదర్శనం`` అని అన్నారు.
దర్శకుడు రామ్‌జీ మాట్లాడుతూ ``మా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. వారందరూ తమ వంతు కృషి చేసి, బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది`` అని అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ ``దిల్‌రాజు గారు నిర్మించిన `ఎవడు` సినిమాలో విలన్‌గా నటించడానికి అప్పుడు ప్రయత్నించా. కానీ నాకు అవకాశం రాలేదు. ఈ రోజు దిల్‌రాజు మా సినిమా యూనిట్‌ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి `మా బ్యానర్‌లో సినిమా ఎప్పుడు చేస్తావు` అని అడిగారు. ఆ మాటలకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారందరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. థ్రిల్ ఫీలయ్యామని చెబుతున్నారు`` అని అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ ``కేరక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నిస్తే పైకొస్తానని ఒకసారి దిల్‌రాజుగారు చెప్పారు. అందుకే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
రెజీనా మాట్లాడుతూ ``సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని ప్రశంసిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.