సాహో తర్వాత సుజీత్ ఫ్యూచర్ ఏంటి..? తలచుకుంటేనే..?
నిండాపాతికేళ్లులేని కుర్రాడు.. 300 కోట్ల సినిమా తీస్తున్నాడు. పెద్దగా అనుభవం కూడా లేదు.. అంతకుముందు తీసింది ఒక్క సినిమానే.. ఇవీ సుజీత్ గురించి ఇప్పటివరకూ అనుకున్న మాటలు. కానీ సాహో సినిమా తర్వాత అతడో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడంటున్నారు సినీ ప్రముఖులు.. రెండో సినిమాకే అద్భుతం సృష్టించిన సుజీత్.. ఫ్యూచర్లో అంతర్జాతీయ సినిమాలు తీస్తాడని ఆకాంక్షించారు.
అతడి గురించి ప్రభాస్ మాట్లాడుతూ... సుజీత్ ఒక్క రోజు కూడా కోపం లేకుండా హ్యాండిల్ చేసిన విధానాన్ని చూసి గొప్ప దర్శకుడు అయిపోతాడనిపించింది. బహుశా అంతర్జాతీయ దర్శకుడు అయిపోతాడేమో... డై హార్డ్ ఫ్యాన్స్ అని ఇందులో సంభాషణలు రాసింది సుజీతే. తనకి మాస్ పల్స్ తెలుసు. తొలిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు సుజీత్ నిక్కరు వేసుకొని వచ్చాడు. 22 ఏళ్ల వయసులో ‘రన్ రాజా రన్’ చేశాడు. ఆ తర్వాత తను చెప్పిన కథ నిర్మాతలకి నచ్చింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పిన విధానం చూస్తే నలభయ్యేళ్ల వయసు వ్యక్తిలా అనిపించాడు. చిత్రీకరణ మదలైనప్పుడు అందరూ పెద్ద సాంకేతిక నిపుణులే. వాళ్లని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని కంగారుపడ్డాం అన్నారు.
ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమాని మోయగలడా? అని సుజీత్‌పై చాలామంది అనుమాన పడ్డారు. ఫస్ట్‌లుక్ చూశాక తన సమర్థత గురించి అర్థమైపోయి ఉంటుంది. తన భుజాలపైనే ఈ సినిమా నిలబడింది. ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా స్టార్. తనని మరింత ముందుకు తీసుకెళ్లాలి.. అన్నారు.
సుజీత్ చిన్నవాడైనా పెద్ద బాధ్యతల్ని నిర్వర్తించాడంటున్నారు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు.. కథపై నమ్మకంతో వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజమౌళి చెప్పినట్టుగా సుజీత్ ఈ సినిమాతో జాతీయ స్థాయి దర్శకుడు అవుతాడని దీవించారు. సుజీత్ అదృష్టవంతుడు అంటున్నారు నిర్మాత దిల్ రాజు.. పాన్ ఇండియా సినిమా తీయడానికి రాజమౌళిగారికి 15 ఏళ్లు పట్టింది రెండో సినిమాకే సుజిత్ ఆ ఘనత దక్కించుకున్నాడని కితాబిచ్చారు.
ఇంతమంది అభిమానం సంపాదించుకున్న సుజీత్ మాత్రం.. ప్రభాస్ ఫ్యాన్స్ కారణంగానే ఇది సాధ్యమైందంటున్నారు. ప్రభాస్ అభిమానుల ఓపికకు హ్యాట్సాఫ్. బాహుబలి తరవాత వెంటనే ఓ సినిమా రావాలని ప్రభాస్ అభిమానులు భావిస్తారు. కానీ రెండేళ్లు ఓపిగ్గా ఈసినిమా కోసం ఎదురుచూశారు. అందుకే వాళ్లని డైహార్డ్ ఫ్యాన్స్ అన్నాను. ఇంత ధైర్యంగా నేను ఉన్నానంటే దానికి కారణం ప్రభాస్ అంటూ అభిమానం చాటుకున్నాడు. మరి సాహో తర్వాత సుజిత్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.