నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్న, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీ, ‘అనార్కలి’లో అక్బర్, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడు మొదలైన పాత్రలు తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయాయి. భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు ఆయన స్వంతం.
ఎస్.వి. రంగారావు పౌరాణిక పాత్రల్లో మేటి. ధారాప్రవాహంగా డైలాగ్ చెప్పడంలోను, డైలాగ్ విరుపులను దిట్ట. ఒకసారి రావణాసురుడు పాత్ర నటిస్తూ, షాట్ గ్యాప్‌లో ఫ్లోర్ బయట కూర్చుని రిలాక్స్‌డ్‌గా సిగరెట్ తాగుతున్నారు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన వాళ్ళలో ఒక బామ్మ ముందుకొచ్చి ఏమయ్యా రంగారావూ!రావణుడు గొప్ప వేద పండితుడు. ఆయన సిగరెట్ తాగడం మేమెక్కడా చదవలేదు, వినలేదు. ఈ వేషంలో సిగరెట్ తాగడం అంత అవసరమా? చక్కగా రామా, కృష్ణా అంటూ కూర్చో అంటూ వెళ్ళిపోయింది. రావణాసురుడు షాక్ తిని, సిగరెట్‌పారేసి సెట్‌లోకి వెళ్లిపోయాడు.
బాపుగారి సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్.వి.రంగారావు రావణాసురుడుగా, చంద్రకళ సీతగా నటించారు. అశోకవనంలో చెట్టుకింద సీత దీనంగా కూచుని వుంది. ఎస్.వి.ఆర్. ప్రవేశించి సీతా! సుందరీ! యవ్వనం సెలయేరు లాంటిది వృధా పోనీయకు. నన్ను కరుణించు అంటాడు. బదులుగా సీత మూర్ఖుడా!మూర్ఖుడికి మోక్షంలాగే నేను నీకు లభ్యం కాను అనే డైలాగ్ చెప్పాలి. చంద్రకళ మెడ్రాస్ కాన్వెంట్‌లో చదవడం వల్ల తెలుగు సరిగ్గా రాదు. మూర్ఖుడా బదులు మూకుడా అని, తప్పు గ్రహించి, సారీ అంకుల్, వెరీ సారీ అంది. ఎస్.వి.ఆర్. అందుకుని నెవ్వర్ మైండ్ సీత కమాన్ క్యారీఆన్ అన్నాడు. డైలాగ్ రికార్డు చేసిన సౌండ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి, చనువుగా ఎస్.వి.ఆర్.తో ఏమయ్యా నువ్వు తెలుగు రావణాసురుడివా? ఇంగ్లీష్ రావణాసురుడిగా? అని అడిగాడు. అందుకు ఎస్వీఆర్ ఎన్ని భాషలకైనా ప్రపంచంలో ఒక్కడే రావణాసురుడు. దట్ ఈజ్ ఎస్.వి.ఆర్. నేను చెప్పిందే డైలాగ్, రికార్డ్ చేసుకో ఫో అన్నాడు. ఈ సంఘటనకు ఆ ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళంతా నవ్వారు. పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరు. అనర్గళంగా డైలాగ్ చెప్పడంలో, డైలాగ్ త్రో లో ఆయనకు ఆయనే సాటి. నర్తనశాలలో కీచుకుని పాత్రకు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయనకు ఆసియా ఉత్తమ సహాయనటుడిగా అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.