బాలీవుడ్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో సంజయ్‌దత్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. బాలీవుడ్ ప్రముఖ నటీ,నటులు నర్గీస్, సునీల్ దత్ ఏకైక సంతానం సంజయ్‌దత్. నర్గీస్, సునీల్ దత్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించిన వారు కావడంతో సంజయ్‌దత్ కి అప్పట్లోనే మంచి క్రేజ్ వచ్చింది. బాలనటుడిగా అడుగు పెట్టిన సంజయ్ దత్ ‘రాఖీ’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం సంజూని హీరోగా మార్చింది.
అయితే ఎంతో భవిష్యత్ ఊహించుకొని సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సంజయ్ దత్ పై నీలి నీడలు అల్లుకున్నాయి. కెరీర్ బిగినింగ్ లోనే ఆయన డ్రగ్స్ కి బానిసయ్యారు. ఒకదశలో చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన సంజయ్‌దత్ ని తండ్రి సునీల్ దత్ ఎన్నో కష్టాలు పడి కాపాడుకున్నారు. మళ్లీ వెండితెరపై హీరోగా వెలిగిపోతున్న సమయంలోనే ‘ఖల్ నాయక్’ సినిమా తర్వాత ముంబాయి బాంబ్ బ్లాస్ట్స్ కేసులు నడుస్తున్న సమయంలో ఏకే 47 ఆయన ఇంట్లో లభ్యం కావడంతో టాడా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు.
సుదీర్ఘ కాలం జైల్లోనే గడిపిన సంజయ్ దత్ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు..కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్ మూవీ కూడా వచ్చింది. రాజూ హిరాని దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘సంజు’మూవీ మంచి సక్సెస్ సాధించింది. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాదత్ తన సోదరుడు సంజయ్‌దత్ త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ దత్ సెప్టెంబరు నెల25వ తేదీన రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ దత్ దుబాయ్ లో ఉన్నారని..ఆయన పార్టీలో చేరతారని దత్ వీడియోను కార్యకర్తల సమావేశంలో ప్రదర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్పీకి సముచిత స్థానాలు కేటాయిస్తామని బీజేపీ మంత్రి పంకజ ముండే ఇటీవల ప్రకటించారు. ఒకవేళ సంజయ్ దత్ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని ముంబై పార్టీ వర్గాలు చెపుతున్నాయి.