తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ అసురన్ ఇటీవల విడుదలై 100కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. వెట్రిమారన్ డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇతర భాషల్లో రీమేక్ చేయాలనీ చూస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ అసురన్ రీమేక్ లో నటించనున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మించనున్నాడు. ప్రస్తుతం నటీనటులు , టెక్నీషియన్లను ఫైనల్ లో చేసే పనిలో వున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడని సమాచారం. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమాను వీక్షించాడు షారుక్. అతనికి సినిమా బాగా నచ్చడంతో కొన్ని మార్పులు చేసి అసురన్ హిందీ లో రీమేక్ చేయాలనే యోచనలో వున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈచిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి. త్వరలోనే ఈ రీమేక్ గురించి ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే గత ఏడాది జీరో తో ప్రేక్షకులముందుకు వచ్చిన షారుక్ కు ఆ చిత్రం గట్టి షాక్ ఇచ్చింది. దాంతో షారుఖ్ కథల ఎంపికలో పునరాలోచనలో పడ్డాడు. జీరో తరువాత ఇప్పటివరకు అతను మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో షారుఖ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు.