మోక్షజ్ఞతో బోయపాటి రాయబారాలు !
నందమూరి బాలకృష్ణ వారసుడుగా మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీని చూడాలని ఆశ పడుతున్న బాలయ్య అభిమానుల కోరిక ఇప్పట్లో తీరేలాలేదు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే బాలకృష్ణకు మాత్రం తన కొడుకును ఫిలిం ఇండస్ట్రీలో వారసుడుగా చూసుకోవాలన్న కోరిక రోజురోజుకు పెరిగి పోతున్నట్లు టాక్.
దీనితో ఫిలిం ఇండస్ట్రీ పై మోక్షజ్ఞకు అభిరుచితో పాటు మోజును కూడ పెంచాలని కొంతమంది ప్రముఖ దర్శకుల చేత బాలయ్య మోక్షజ్ఞకు బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణకు బాగా సన్నిహితంగా ఉండే బోయపాటి క్రిష్ రాఘవేంద్రరావు లతో బాలయ్య మోక్షజ్ఞకు ఈ బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు ఇప్పిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి.
నందమూరి బాలకృష్ణ కొడుకుగా పుట్టడం ఒక అదృష్టం అయితే అతడి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయితే వచ్చే ఖ్యాతితో పాటు ఏర్పడే లక్షలాది మంది అభిమానుల ప్రేమానురాగాల గురించి మోక్షజ్ఞకు వీరింతా వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞకు సినిమాలకన్నా పారిశ్రామిక వేత్తగా ఎదగాలి అన్న కోరిక ఉన్న నేపధ్యంలో కొన్ని సంవత్సరాలు హీరోగా కొనసాగి అప్పటికీ ఫిలిం ఇండస్ట్రీ నచ్చకపోతే వ్యాపార రంగంలోకి వెళ్ళవచ్చని వారంతా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మోక్షజ్ఞకు ఇప్పటికే డాన్స్ ఫైట్స్ మరియు నటన విషయంలో శిక్షణ ఇప్పించినా గత కొంతకాలంగా మోక్షజ్ఞ లుక్ లో బాగా మార్పులు వచ్చి బాగా అవ్వడమే కాకుండా కొద్దిగా అతడికి పొట్ట కూడ వచ్చినట్లు బయటకు లీక్ అవుతున్న ఫోటోలను బట్టి తలుస్తోంది. అయితే మోక్షజ్ఞ ఎక్కడా బయట కనబడకపోవడంతో బాటు ఆఖరికి నందమూరి కుటుంబ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడ మోక్షజ్ఞను కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో బోయపాటి లాంటి క్రేజీ దర్శకులు మోక్షజ్ఞ మైండ్ ను ఎంతవరకు మారుస్తారో అన్న విషయం రానున్న కాలంలో బయటపడుతుంది. దీనితో బాలయ్య వారసుడు మనసు మారాలని అభిమానులు ఎంతగానో మోక్షజ్ఞ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు..