మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. మాలో విబేధాలు ఉన్నమాట ముమ్మాటికీ వాస్తవం అంటూ రాజశేఖర్ మీడియా సమక్షంలోనే సినీ అతిరధుల ముందే కుండబద్దలు కొట్టేశారు. మొహమాటాలు లేకుండా సినీ నగ్న సత్యాలు ఆవిష్కరించారు. ఆ తరవాత దీనిపై సినీ పెద్దలంతా సీరియస్ కావడం, ఆ తర్వాత మాట్లాడిన జీవిత రాజశేఖర్ బదులు సారీ చెప్పడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. అసలు రాజశేఖర్ మాట్లాడేందుకు రాక ముందే.. ఈ గొడవ జరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి ముందే ఊహించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. రాజశేఖర్ మాట్లాడటానికి ముందు మాట్లాడిన చిరంజీవి.. మా అసోసియేషన్ లో మంచి ఏదైనా ఉంటే మైక్ ముందు చెప్పండి.. చెడు ఏమైనా ఉంటే చెవిలో చెప్పండని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి కాదు అనేక సార్లు చెప్పారు. మరి మెగాస్టార్ ఎందుకు అంతగా ముందుజాగ్రత్తపడ్డారు.
అంతేకాదు.. చిరంజీవి ఏమన్నారో తెలుసా.. మన ముందు మీడియా మిత్రులు ఉన్నారు. వారు ఎలాంటి వారో తెలుసా.. వాళ్లంతా టైగర్స్.. మనలో ఏమాత్రం తేడా దొరికినా ఉతికి ఆరేస్తారు. అది వాళ్ల తప్పుకాదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వుతూ చెప్పారు. అలా చెప్పిన కొద్దిసేపటికే రాజశేఖర్ రచ్చ రచ్చ చేశారు. ఇదెలా సాధ్యమైంది.. అంటే గొడవ జరగబోతోందని మెగాస్టార్ కు ముందే తెలుసా..
అసలు మా అసోసియేషన్ లో గొడవలు కొత్త కాదు.. అందులోనూ ఈ కార్యక్రమానికి సినీ పెద్దలంతా వచ్చారు. మీడియా అటెన్షన్ తప్పకుండా ఉంటుంది. కాబట్టే బహుశా చిరంజీవి ఈ విషయాన్ని ముందుగా పసిగట్టారా.. లేక.. రాజశేఖర్ చెప్పినట్టు మాలో నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి చిరంజీవికి ముందే తెలుసు కాబట్టే అలా ముందుగానే హెచ్చరించారా..?
మరింత సమాచారం తెలుసుకోండి: