ధియేటర్ లో రచ్చరచ్చ చేసిన రామ్ చరణ్ !

Seetha Sailaja
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుక్రవారం సాయంత్రం సంధ్యా థియేటర్ వద్ద రచ్చరచ్చ చేసి హంగామా సృష్టించాడు. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చరణ్ అభిమానులతో కలిసి హడావిడి చేసి ‘ఎవడు’ ట్రైలర్ విడుదల చేసాడు.  రామ్ చరణ్ రాకను పురస్కరించుకుని థియేటర్ వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. బ్యాండ్ భాజాలతో అభిమానులు హంగామా సృష్టించారు. రామ్ చరణ్ ప్లెక్సీలకు పాలాభిషేకం చేసారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రామ్ చరణ్ రాగానే విజిల్స్, కేరింతలతో తమ మనసులోని ఆనందాన్ని వెలుబుచ్చారు అభిమానులు. అంతేకాదు చెర్రీ తన అభిమానుల కోరిక మేరకు ‘ఎవడు’ సినిమాలోని ఓ డైలాగు కూడా చెప్పారు. తాను ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రాలేదని, తనకు సినిమాను ప్రమోట్ చేయడం చేతకాదని, అభిమానుల మధ్య గడపడానికి మాత్రమే వచ్చానని చరణ్ తన మెగా అభిమానులకు జోష్ ను కలిగించే మాటలు అన్నాడు. ఇదే సందర్భంలో రామ్ చరణ్ సంక్రాంతికి విడుదలయ్యే తన ‘ఎవడు’ సినిమాతో పాటు మిగతా హీరోల సినిమాలు కూడా విజయవంతం కావాలని కోరుకున్నాడు. సంక్రాంతికి విడుదలవుతున్న మహేష్ బాబు ‘1’ నేనొక్కడిని ఉద్దేశించే చెర్రీ ఆ మాటలు అన్నాడని మెగా అభిమానులు భావిస్తున్నారు.  ఎవడు థియేట్ర్రికల్ ట్రైలర్ విడుదలైన అనంతరం అభిమానులతో కలిసి రామ్ చరణ్ వీక్షించడం ఈ కార్యక్రమంలో హైలేట్. ఆరు నెలల క్రితం రావలసిన సినిమా ‘ఎవడు’ ఇప్పుడు విడుదల అవుతున్నా మెగా అభిమానుల హడావిడి చూస్తూ ఉంటే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలానే కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: