పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు షాక్ అయి ఆశ్చర్యపడుతున్న నందమూరి అభిమానులు !
తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలలు పూర్తి కాకుండానే అధికారంలోకి వచ్చిన నందమూరి తారకరామారావు పొలిటికల్ రికార్డును ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ టాప్ హీరో బ్రేక్ చేయలేకపోయాడు. ఎన్టీఆర్ లాగే అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కావాలని చిరంజీవి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
దీనితో తన అన్న సాధించలేని ఘన కార్యాన్ని సాధించాలని ప్రయత్నించిన పవన్ కు తన అన్న కన్నా తక్కువ ఓట్లు పడినా తన ఓటమిని అంగీకరించకుండా తిరిగి రాజకీయాలలో రాణించాలని పవన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే ‘జనసేన’ కు భారతీయ జనతా పార్టీకి తిరిగి మైత్రీ బంధాన్ని చిగురింప చేసిన పవన్ నిన్న తన జనసైనికుల తో మాట్లాడుతూ చేసినట్లుగా వస్తున్న కామెంట్స్ నందమూరి అభిమానులకు ఆశ్చర్యంతో పాటు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్.
ఎన్టీఆర్ తరువాత ఒక రాజకీయ పార్టీని పెట్టి ఇన్ని సంవత్సరాలు పార్టీని కొనసాగిస్తున్న రికార్డు తన సొంతం అంటూ పవన్ జనసైనికుల ఉత్సాహాన్ని కలిగించడానికి చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులకు అర్ధంకాని విషయాలుగా మారాయి. గత ఎన్నికలలో 7 శాతం ఓట్లు తెచ్చుకున్న పవన్ ‘జనసేన’ కు తెలుగుదేశం పార్టీకి పోలిక ఏమిటి అంటూ వారు షాక్ అవుతున్నట్లు సమాచారం.
అంతేకాదు ఎన్టీఆర్ రాజకీయాలలో కొనసాగుతూ సినిమాలలో నటించిన విధంగా తాను కూడ సినిమాలలో నటిస్తున్నాను అంటూ పవన్ సరికొత్తగా చేస్తున్న వాదన జనసైనికులు అంగీకరించినా ఈ రెండు పడవల ప్రయాణం ఎంత వరకు పవన్ కు ఇమేజ్ తెచ్చి పెడుతుంది అన్న విషయం పవన్ అభిమానులకు కూడ సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఇది ఇలా ఉండగా పవన్ వరస పెట్టి అంగీకరిస్తున్న సినిమాల సంఖ్యను చూస్తున్న వారు మాత్రం ఇన్ని సినిమాలను పవన్ ఎప్పటికి పూర్తి చేయగలుగుతాడు అంటూ షాక్ అవుతున్నట్లు టాక్..