నేచురల్ స్టార్ నాని , శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ లో ఇప్పుడు రెండో సినిమా తెరకెక్కనుంది. టక్ జగదీశ్ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం ఇటీవలే అధికారికంగా లాంచ్ అయ్యింది. ఫిబ్రవరి 11నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఇంకా షూటింగ్ కూడా కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. 3.5కోట్లకు ఈ సినిమా హక్కులను వీకెండ్ సినిమాస్ దక్కించుకుంది. అయితే నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.
ఇటీవల ఒక్క దేవదాస్ తప్ప దాదాపుగా నాని నటించిన అరడజనుకు పైగా సినిమాలు అక్కడ వన్ మిలియన్ పైగా వసూళ్లను రాబట్టాయి ఆలెక్కన చూస్తే టక్ జగదీష్ ను తక్కువకు అమ్మినట్లే. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ,తమిళ నటి ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. జులై లో ఈచిత్రం విడుదలకానుంది.
ఇక ఈ సినిమా కన్నా ముందు నాని వి అనే సినిమాతో రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలకానుంది. నానికి ఇది 25వ సినిమా కావడం విశేషం. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా నటించగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాని విలన్ గా కనిపించనుండగా నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.