అఘోరా పాత్రలో ఘోరాతి ఘోరంగా.. మంచు మనోజ్..!
చాలా గ్యాప్ తరువాత అఘోరా పాత్రలో మంచు మనోజ్ కథానాయకుడిగా 'అహం బ్రహ్మాస్మి' రూపొందనుంది. సొంత బ్యానర్ పై ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీన ప్రారంభం కానుంది. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా బాధ్యతలు చేపడుతున్నారు. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమా, ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరో వార్త ఈ సినిమా గురించి షికారు చేస్తోంది.
ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోరాగా కనిపించనున్నాడనేది ఆ వార్త సారాంశం. సాధారణంగా అఘోరాగా కనిపించడానికి హీరోలు అంతగా సాహసించరు. కానీ మూడేళ్ల విరామం తరువాత వస్తున్న మనోజ్ మాత్రం అఘోరాగా తెరపై ఘోరాలు సృష్టించబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఆయన పాత్రను మలిచిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇంకా ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో అని మంచు అభిమానులు ఆత్రంగా ఆరాటపడుతున్నారు.
ఇటీవల, తన పెళ్లి డివోర్స్‌తో ముగిసిందని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వచ్చిందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని క్లారిటీగా చెప్పేశాడు. మనసు బాగోలేక పోవడం వల్లే ఇన్ని రోజులూ పని మీద ఫోకస్ పెట్టలేకపోయానని, ఇక ముందు బాధనంతటినీ పక్కన పెట్టేసి కెరీర్‌పై దృష్టి పెడతానని.. తన బాధ అంతటిలో తన కుటుంబం తనకు తోడుగా నిలిచిందని మనోజ్ తన పోస్ట్‌లో వివరించాడు.
2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లైన కొద్ది రోజులనుండే వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. చివరకిలా విడాకులతో శాశ్వతంగా విడిపోయారు. మనోజ్ చేసిన పోస్ట్ చూసి, ‘జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి.. ధైర్యంగా ఉండాలి.. త్వరలోనే నిన్ను బిగ్ స్క్రీన్‌పై చూడాలి.. అంటూ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ అతనికి మద్దతుగా కామెంట్స్ పెట్టిన సంగతి అందరికి తెలిసినదే.