చిరంజీవి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని... చెప్పుతో కొట్టి పంపారు... పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు...!
ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, వైసీపీ నేత పృథ్వీ రాజ్ ఒక టీవీ ఛానల్ కార్యక్రమానికి హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎస్వీబీసీ ఛానల్ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడానంటూ వైరల్ అయిన ఆడియో టేప్ ఫేక్ అని చెప్పారు. ఎవరో తన వాయిస్ ను మిమిక్రీ చేసి ఇరికించారని అన్నారు. పదవి కోసం తానెప్పుడూ ప్రాకులాడలేదని, ఛానల్ వాళ్లు తనను చెప్పుతో కొట్టి బయటకు పంపించారని వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి లేకపోతే తాను ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేవాడినని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గొప్ప వ్యక్తి అని అన్నారు. ఎస్వీబీసీ వివాదం తర్వాత తనకు అవకాశలివ్వామని చెప్పిన వ్యక్తి చిరంజీవి అని చెబుతూ పృథ్వీ ఎమోషనల్ అయ్యారు. ఆయన అలా అండగా లేకపోతే తాను ఈ పాటికే ఆత్మహత్య చేసుకునేవాడినని షాకింగ్ కామెంట్లు చేశారు.
రైతుల గురించి తాను ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడలేదని, తన మాటలను వక్రీకరించారని చెప్పారు. వైసీపీలో తన ఎదుగుదల కొందరికి నచ్చలేదని అందుకే అభియోగాలు మోపారని అన్నారు. సీఎం జగన్ పై అభిమానంతో తాను అవన్నీ భరించానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తనను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బ్రతికిలేరని కన్నీళ్లు పెట్టుకున్నారు. సొంత పార్టీ వారే తనపై కుట్ర చేశారని... అయినా వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారని... అందువల్లే తాను పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తనకు పదవి ఇచ్చిన మొదటిరోజు నుండే అందరూ తనను టార్గెట్ చేశారని చెప్పారు. పదవిలో ఉన్నన్ని రోజులు తనపై లేనిపోని అబాండాలు మోపారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.