ఒక కాంబినేషన్ రిపీట్ కావాలి అంటే ఆ కాంబినేషన్లో వరుస సూపర్ హిట్లు వచ్చి ఉండాలి. వాళ్ల కాంబినేషన్ ప్రతీ సారి అభిమానులను సర్ప్రైజ్ చేసే అంశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ జోడిని తెర మీద మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అలా టాలీవుడ్లో సూపర్ హిట్ జోడి అనిపించుకున్న దర్శకుడు, హీరోల కాంబినేషన్ సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు కేయస్ ఆర్ దాస్ లది. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 30 సినిమాలు వచ్చాయి.
వందకు పైగా సినిమాలను తెరకెక్కిన దాస్ అందులో 30 సినిమాలు కేవలం ఒక్క కృష్ణ హీరోగానే తెరకెక్కించాడంటేనే వాళ్ల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ సాదించిందో ఊహించవచ్చు. లోగుట్టు పెరుమాళ్లు కెరుక సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నాడు దాస్. ఇక కృష్ణ హీరోగా దాస్ తెరకెక్కించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ సినిమాతోనే వీరిద్దరి సక్సెస్ జర్నీ స్టార్ అయ్యింది. కౌబాయ్ గెటప్, గుర్రాలు, చేజింగ్, నిధి వేట ఇలా తెలుగు సినిమాకు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశాడు దాస్.
తెలుగు తెరకు కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి కొత్త నేపథ్యాన్ని పరిచయం చేసిన చరిత్ర కూడా కృష్ణ, దాస్ లదే. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఓ చరిత్ర. ఈ సినిమా తెలుగులోనే కాదు ఇతర భారతీయ భాషల్లోనూ సంచలనం సృష్టించింది. అంతేకాదు ఇంగ్లీష్‌లోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాకు కూడా ఇదే కావటం విశేషం. అందుకే వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూసేవారు. ఎప్పటికప్పుడు అభిమానుల అంచనాలను దాటుతూ మరిన్ని విజయాలను అందుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొదలైన వీరి ప్రయాణం కలర్ సినిమాల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. అందుకే ఇప్పటికే ఎవర్ గ్రీన్ హిట్ దర్శక హీరోల జోడి అంటే కే యస్ ఆర్ దాస్, సూపర్ స్టార్ కృష్ణలే ముందుగా గుర్తుకు వస్తారు.
మరింత సమాచారం తెలుసుకోండి: