తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కె.వి రెడ్డి రూ.21వేల అప్పు అడిగితే ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా?
కె.వి రెడ్డి జీవితంలో ఎన్నో స్ఫూర్తి దాయకమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్య బీ.ఎస్సి(హానర్స్) తను చదివినప్పటికీ... ఎక్కడా ఉద్యోగాలు దొరకకపోవడంతో రూ.250తో తనే స్వయంగా శాస్త్రోపకరణాల షాప్ ని పెట్టుకొని లాభాలు అర్జించారు. ఈ క్రమంలోనే అతని బాల్య స్నేహితుడు మూలా నారాయణస్వామి... రోహిణి పిక్చర్స్ సంస్థలో ఆయనికి క్యాషియర్ ఉద్యోగం ఇప్పించాడు. తర్వాత ఆ సంస్థలో నిర్మిస్తున్న గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్ గా పనిచేసిన కె.వి.రెడ్డి ఆ తర్వాత తన బాల్య స్నేహితుడితో పాటు బి.యన్.రెడ్డి యొక్క వాహినీ సంస్థకి మకాం మార్చారు. ఆ సమయంలోనే ప్రొడక్షన్ మేనేజరుగా కె.వి.రెడ్డి ఒక సంవత్సరం పాటు పనిచేశారు.
ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న కె.వి.రెడ్డికి సినిమా ఎలా తీయాలి అనే ఒక అవగాహన వచ్చింది. అప్పట్లో వాహినీ సంస్థ నిర్మాణంలో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు మంచి పేరునే సంపాదించుకున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడేవి. దాంతో వాహినీ సంస్థ చాలా నెలలవరకు పతనానికి దగ్గరలో కొట్టుమిట్టాడింది. మరో వైపు కె.వి.రెడ్డి భక్తపోతన సినిమాకు స్క్రిప్ట్ ను రాసుకున్నారు. అతను ఒకసారి స్క్రిప్టు రాసుకున్నారంటే మళ్ళీ షూటింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ లో ఏ మాత్రం మార్పు చేయాల్సిన అవసరం లేకపోయేది. భక్తపోతన సినిమా తీసేందుకు స్క్రిప్టు రాసుకున్న కె.వి.రెడ్డి కి చాలా రోజుల పాటు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మొదటిలో వాహిని నిర్మాణ సంస్థ వారు దర్శకత్వ శాఖలో ఎటువంటి అనుభవం లేని కె.వి.రెడ్డి ఎలా సినిమా తీయగలరుతారని... నిర్మాణ సంస్థ కచ్చితంగా దివాలా తీస్తుందని అంటూ అతనిని సినిమా తీసేందుకు అనుమతించలేదు. ఐతే కొన్ని షరతులను మూలా నారాయణస్వామి పెట్టి కె.వి.రెడ్డి సినిమా తీసేలా చేశాడు. అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అనుకున్న భక్త పోతన సినిమా ఘన విజయం సాధించడంతో మళ్లీ వాహినీ నిర్మాణ సంస్థ ఒక గాడిలో పడింది.
ఆ తర్వాత కాలక్రమేణ ఆదాయపు పన్ను శాఖ వారు వాహినీ సంస్థ పై రైడ్ చేయడం, డబ్బులన్ని జప్తి చేయడం, మూలా నారాయణస్వామి క్షయ వ్యాధితో చనిపోవడం జరిగిపోయాయి. దాంతో బి.ఎన్ రెడ్డి, కె.వి రెడ్డి కలిసి విజయా ప్రొడక్షన్స్ కి తెరలేపి సినిమాలు తీయడం ఆరంభించారు. ఐతే ఆ విజయ ప్రొడక్షన్ కూడా దివాలా స్థితిలో ఉండటంతో... ప్రముఖ అరేబియన్ నైట్స్ కథలలోని అల్లావుద్దీన్ అద్భుతదీపం అనే ఒక కథను స్ఫూర్తిగా తీసుకొని పాతాళ భైరవి సినిమాకి పింగళితో కథ రాయించుకున్నారు కె.వి రెడ్డి. ఐతే మొదటిలో తోటరాముడిగా ఏఎన్ఆర్, నేపాల మాంత్రికుడిగా ముక్కామలను కె.వి రెడ్డి అనుకున్నారు. కానీ ఓ టెన్నిస్ మ్యాచ్ లో ఓడిపోతూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఎన్టీ రామారావు ని చూసిన కె.వి రెడ్డి ఆయన్నే తోటరాముడు గా ఫిక్స్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ ఎస్.వీ రంగారావు ని ప్రతినాయకుడిగా సూట్ అవుతాడని అతన్ని తీసుకున్నారు. తరువాత పాతాళభైరవి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించి (కలెక్షన్ రూ.75లక్షలు) విజయా సంస్థ కి లాభాలు చేకూర్చి... ఎన్టీఆర్ కి, ఎస్వీ రంగారావుకి లైఫ్ ని ఇచ్చాయి. ఐతే కె.వి రెడ్డి తనకు మంచి లైఫ్ ని ఇచ్చారని రామారావు ఆయనికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఆయన వస్తున్నారంటేనే చేతులు కట్టుకొని 'గురువు గారు' అని సంబోధించేవారు. వీళ్లిద్దరి కాంబో లో జగదేక వీరుని కథ, మాయాబజార్ లాంటి చాలా మంచి సినిమాలు వచ్చాయి.
ఒకరోజు అవధాన స్థితిలో ఉన్న కె.వి.రెడ్డి ఎన్టీరామారావు వారి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఎన్టీ రామారావు తన తమ్ముడుతో ముచ్చట పెడుతున్నారు. ఆ సమయంలోనే కె.వి.రెడ్డి చేతి కర్ర పట్టుకుని రామారావు ఇంటి మేడ మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నారు. ఇది గమనించిన ఎన్టీఆర్ కి గురుభక్తితో చెమటలు పట్టేసాయి. వెంటనే అతనికి చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చి కె.వి రెడ్డి ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి చేతులు కట్టుకొని నిల్చున్నారు ఎన్టీఆర్. అప్పుడు కె.వి.రెడ్డి మాట్లాడుతూ 'మిస్టర్ రామారావు! ఐ హవ్ ఏ ఫేవర్ టు అస్క్ యు', అని అన్నారు. ఏంటో, చెప్పండి గురువుగారు అని రామారావు అన్నారు. మా అబ్బాయి అమెరికా వెళ్దామనుకుంటున్నాడు. వాడికి రూ.21వేలు అవసరం పడింది. నేను చూస్తున్నాను డబ్బులు కోసం. నాకు ఇంకా శక్తి చచ్చిపోలేదు. నాకు దానధర్మం ఏమీ అవసరం లేదు. ఏవైనా సినిమా ఆర్డర్ లో ఉంటే చేస్తాను. మీరేదో సినిమా తీస్తున్నారని విన్నాను. ఆ మూవీ కి స్క్రీన్ ప్లే రాసే అవకాశం కల్పిస్తారా?' అని అడిగారు.
ఎన్నో అత్యుత్తమ చిత్రాలు తీసిన కె.వి.రెడ్డి ఎవరికీ తలవంచరు. అలాంటి కె.వి.రెడ్డి తనని ఇలా అడిగేసరికి రామారావు కంట నీళ్లు చెమ్మగిల్లాయి. వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి ఒక సంచిని తీసుకొచ్చి రూ. 21 వేలు తీసుకోండి గురువు గారు అంటూ కె.వి రెడ్డి చేతికిచ్చారు రామారావు. అప్పుడు కేవీ రెడ్డి మాట్లాడుతూ... 'ఆలోచించుకోవాలి, కదా అయ్యా! ఆలోచించి కదా మీరు ఇవ్వాల్సింది. సినిమా చేయకుండా నేను తీసుకొను కదా. మీరు ఉచితంగా ఇస్తే నేను తీసుకోను. చేయగలిగిన సినిమా ఏదైనా ఉంటే నేను చేస్తాను. నేను చేయగలిగితేనే డబ్బులు తీసుకుంటాను. లేకపోతే డబ్బులు తీసుకోను. మీరు ఆలోచించుకోవాలి కదా' అని కెవి రెడ్డి ఆ కవర్ ని రామారావ్ కి తిరిగి ఇచ్చేశారు. దాంతో ఎన్టీఆర్ కాసేపు అలోచించి 'సరే, గురువు గారు. మీరు నేను నటించబోయే తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించండి. అందుకుగాను ఈ రూ.21వేలను అడ్వాన్స్ గా ఉంచండి' అని ఆ కవర్ ని కె.వి రెడ్డి కి ఇచ్చారు. ఆ తర్వాత ఇక కె.వి.రెడ్డి రామారావు అప్పు తీర్చేందుకు ఎన్టీఆర్ తో చేసిన ఆ సినిమా పేరే శ్రీకృష్ణసత్య.