మనసు కవి ఆచార్య ఆత్రేయ మరపురాని మధుర గీతాలు..

Edari Rama Krishna

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు  మే 7, 1921 జన్మించారు. తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. సెప్టెంబర్ 13, 1989లో ఆయన తెలుగు చిత్ర సీమను వదిలి వెళ్లారు. తెలుగు సినిమాల్లో ఆత్రేయ మనసు పాటలతో పాటు తనదైన ముద్రగల వలపు పాటలు, వానపాటలు, వీణ పాటలు, అమ్మ పాటలు, ... కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించి మనిషికీ మనసుకీ కొత్త భాష్యాలు చెప్పిన ఆచార్య ఆత్రేయ ఓ అక్షర యోగి అంటారు.  ఆయన రాసిన పాటలు ఈనాటికీ.. ఏనాటికీ మరువలేని విధంగా ఉంటాయి.

 

నేనొక ప్రేమపిపాసిని :
ప్రేయసి కోసం ఎదురు చూసి చూసి అమె నుంచి ఏమీ బదులు రాక చివరకు నిరాశగా వెనుతిరిగే ఒక ప్రియుడి ఆవేదనను తన పాట రూపంలో చెప్పాడు ఆత్రేయ. ఆత్రేయ జీవితంలో ప్రేమ విషాదాన్ని చవి చూసి.. భగ్నప్రేమికుడయ్యాడని.. అందుకే అంత అద్భుతంగా రాయగలిగాడని అంటారు. తలుపు మూసిన తలవాకిటనే.. పగలు రేయి నిలుచున్నా.. పిలిచి పిలిచి బదులేరాక.. అలసి తిరిగి వెళుతున్నా... అంటూ తన అనుభవాల్నే కవిత్వీకరించాడని.. అంటారు.

 

పచ్చ గడ్డి కొసేటి పడుచు పిల్లా :
జాన పదాల నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకుని పాపులర్ పాటలు రాయడంలో కూడా ఆత్రేయ సిద్దహస్తుడు. ఎన్నో పాపులర్ జానపద పల్లవులు తీసుకుని ఎన్నో మంచి పాపులర్ సాంగ్స్ రాశారు. ఈ పాటలన్నీ ఆ సినిమాల విజయంలో పాత్ర పోషించినవే.  ''ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్ధలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు..'' అంటూ.. 'ప్రేమనగర్'లో అద్భుతమైన డైలాగ్స్ రాసిన ఆత్రేయ వేల ఎకరాలు సంపాదించుకోలేదు గాని.. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తన పాటలతో చిరస్మరణీయుడయ్యాడు.

 

చిటపట చినుకులు పడుతూ వుంటే :
ఆత్రేయ రాసిన యుగళగీతాలు యూత్‌ను ఉర్రూతలూగిస్తాయి. తెలుగు ప్రేమికులు మాత్రం ఆత్రేయ పాటల్ని ఎప్పటీకి మర్చిపోలేరు. ఆత్రేయ కలం నుంచి వచ్చిన విరిజల్లే - "చిటపట చినుకులు పడుతూవుంటే ... పాట మొదటి వర్షపు పాటగా చెప్పుకోవచ్చు.


తేట తేట తెలుగులా :
తెలుగు కమనీయదనాన్ని ఒక అందమైన అమ్మాయికి అన్వయిస్తూ గమ్మత్తు చేశాడు ఆత్రేయ. ప్రేమనగర్ చిత్రంలోని ఘంటసాల గళం నుంచి జాలువారిన తేటతేట తెలుగులా పాటకు మహదేవన్ సంగీతం మరింత అందాన్నిచ్చింది. అందుకే ఆత్రేయ రచనల్లో ఈ పాట ఎప్పటికీ తెలుగు వారికీ గర్వ కారణంగా నిలిచే ఉంటుంది.

 

జాబిల్లి కోసం ఆకాశమల్లే :
ఆకాశమంటే శూన్యం.. నల్లని చీకటి ఆకాశానికి ఒక అందాన్ని.. అర్థాన్ని ఇచ్చేది చల్లని జాబిల్లి. ఆ జాబిల్లి రాక కోసం ఆకాశం ఎలా ఎదురు చూస్తుందో అలా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను , నీవు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ ఎంత సింపుల్‌గా , ఎంతో అద్భుతంగా రాశారు ఆత్రేయ.

 

ఏ తీగ పూవునో :
సమయానికి పాట రాయక నిర్మాతలను ..పాట రాసిన తరువాత ప్రేక్షకులను ఏడిపిస్తాడనే పేరు ఆత్రేయకు ఉంది. ఆయన పాట రాయడానికి ఎక్కువ సమయం తీసుకుండే వాడట.. అయితేనేం భావ యుక్తంగా, రసాలొలికిస్తూ ఉంటాయి ఆయన పాటలు. నాలుగు దశాబ్దాలపాటు - భక్తి, భావ, శృంగార, దేశ భక్తి రసాలొలికిస్తూ జనరంజకమైన మాటా-పాటలను అందించి చెరగని ముద్ర వేశారు.

 

సంగీత ప్రియులు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకునేలా మధురమైన మనసుగీతాలు రాసిన ఆచార్య ఆత్రేయ 1989 సెప్టెంబర్ 9న కన్నుమూశారు. భౌతికంగా ఆయన లేకపోయినా తెలుగు వారి మనసులలో శాశ్వతంగా గూడు కట్టుకున్నారు. ఆయన రాసిన పాట, మాటలలో చెప్పాలంటే - " పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ". ఆత్రేయ గురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు.. ఆత్రేయ ఒక అద్భుతం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: