'పుష్ప' కోసం బన్నీ పడుతున్న పాట్లు...!
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ 'పుష్ప'. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా కావడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేసారు. కానీ మహమ్మారి సూక్ష్మజీవి వచ్చి అన్నిటిని తారుమారు చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా వారు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. 'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది.
రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా అదరగొడతాడనిపిస్తోంది. ఈ చిత్రం ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుందన్న సమాచారం తెలిసిందే. మామూలుగానే ఎలాంటి యాసను అయినా ఓన్ చేసుకొని చాలా ఈజ్ గా పలికించడం బన్నీలోని ప్రత్యేకత. అది ఇప్పటికే 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డిగా మాట్లాడినప్పుడు కానీ 'అల వైకుంఠపురములో' చిత్రంలో విలన్ రోల్ తో జరిగే సంభాషణలో కానీ మనం గమనించొచ్చు. అలా ఇప్పుడు మరో కోణం కోసం బన్నీ పూర్తిగా చిత్తూరు భాషను అవపోసన పట్టేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బన్నీ ఆ యాసలోని మూలాలను కూడా కనుగొనే పనిలో పడ్డారని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో బన్నీ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మొత్తం మీద 'పుష్ప' కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడని చెప్పవచ్చు. ఇంత కష్టపడుతున్న 'పుష్ప' కి ఎలాంటి ఫలితం దక్కబోతుందో చూడాలి.