కరోనా వైరస్ ను చూసే ధైర్యం ఉందా.. ?
కరోనా తర్వాతా చాలామందిలో మార్పు వచ్చిందంటున్నారు. ఎందరు మారినా రామ్ గోపాల్ వర్మ మాత్రం మారడు. వంద కరోనాలు వచ్చి మీద పడినా.. ఈ ఫేడౌట్ దర్శకుడిలో చలనం ఉండదు. ఆయన కొత్త సినిమా ట్రైలర్ అందుకు నిదర్శనం.
సంచనాలు.. వివాదాల కోసం రామ్ గోపాల్ వర్మ ఏదైనా చేస్తాడు. ప్రతీసారి ఏదో ఒక కాంట్రవర్శీతో పబ్బం గడుపుకునే వర్మ ఈ సారి రికార్డ్ కోసం ప్రయత్నించారు. లాక్ డౌన్ టైమ్ లో హడావిడిగా కరోనాపై సినిమా తీసేసి కరోనాపై వచ్చిన తొలి సినిమాగా రికార్డు.. వర్మ సొంతం అని అమితాబ్ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ పేరుతో తెరకెక్కిన ట్రైలర్ ను వర్మ రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ చాలామందికి రాము అయితే తనకు మాత్రం సర్కార్ అంటూ ట్వీట్ చేశాడు బిగ్ బి.
కరోనాపై వర్మ పాట పాడిన.. సినిమా తీసినా.. భయపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కరోనాలో దెయ్యాన్ని దూసుకున్నాడనుకుంట.కరోనా వచ్చిన తొలినాళ్లలో కనిపించని పురుగు కరోనా అంటూ ఆ మధ్య పాటతో భయపెట్టాడు. ఈ పాటకు కనిపించే పురుగు కరోనా వర్మ అనే కామెంట్స్ వచ్చాయి.
కరోనా వైరస్ సినిమాను వర్మ శిష్యుడు అగస్త్య మంజు డైరెక్ట్ చేశాడు. పేరు శిష్యుడిదే అయినా.. టేకింగ్ మాత్రం వర్మదే. కరోనాను దెయ్యంగా భావించి హారర్ థ్రిల్లర్ మేకింగ్ ను ఫాలో అయ్యాడు. ట్రైలర్ నాలుగు నిమిషాలుంటే.. మొత్తం ఇంట్లోనే సాగింది. రెండున్నర గంటల సినిమాను కూడా ఇంట్లోనే తీసి.. ప్రేక్షకులను క్వారంటైన్ కు పంపిస్తాడేమోనన్న భయం ప్రేక్షకులకు ఉంది. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి.. కరోనా వైరస్ ను అప్పటి వరకు తన దగ్గరే ఉంచుకొని వర్మ.. ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువ.
లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ వివాద సినిమాలకే థియేటర్స్ లో ఆదరణ కరువైంది. ఈ లెక్కన థియేటర్స్ లో భయం భయంగా కరోనా వైరస్ ను చూసే ధైర్యం ప్రేక్షకులు చేస్తారా... అనే సంగతి పక్కన పెడితే.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.