సునీత.. తెలుగు సినీగాయనుల్లో తనకో ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఆమె గులాబీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పటి వరకూ ఆమె తన ప్రత్యేకత చాటుతూనే ఉంది. గాయని గానే కాదు..ఎందరో హీరోయిన్లకు ఆమె గాత్ర దానం కూడా చేశారు. సంప్రదాయబద్దంగా కనిపిస్తూనే తన అందచందాలతో ఆమె కట్టిపడేస్తుంది.
అందం, అందమైన గాత్రం రెండూ ఒకరికే ఉండటం చాలా అరుదు. గాయని సునీత విషయంలో మాత్రం ఇది సాధ్యమైంది. ఆమె పాటకు ఎందరో ఫిదా అయ్యారు. అలా ఆమెను మెచ్చుకున్న వారిలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారట. ఆయన గాయని సునీత మంచి పాట పాడినప్పుడల్లా ఫోన్ చేసి మరీ అభినందించేవారట.
ఓసారి అక్కినేని దంపతులు గాయని సునీతను తమ ఇంటికి పిలిపించుకుని గౌరవంగా కొత్త బట్టలు పెట్టారట. అంతే కాదు.. తమ కుటుంబ సభ్యులందరితో కలసి భోంచేయాల్సిందేనని పట్టుబట్టారట. అంతే కాదు. అక్కినేని స్వయంగా ఆమెకు వడ్డించారట. ఆ తర్వాత ఆమెను దీవిస్తూ.. నీలాంటి సింగర్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం అంటూ కితాబిచ్చారట. సింగర్ సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
నిజంగా అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటుడి చేత అలాంటి పొగడ్తలను తాను జీవితంలో మరిచిపోలేనన్నారు గాయని సునీత. ఇంకా ఆ పాత అనుభవాలు పంచుకోబోతూ.. వద్దులెండి.. మనకు మనమే గొప్పలు చెప్పు కున్నామనుకుంటారు.. అంటూ ఆగిపోయారు. నిజంగా ఓ గాయనికి అంతకంటే చెప్పుకోదగ్గ అనుభవం ఏముంటుంది. అక్కినేని నాగేశ్వరరావు వంటి నట దిగ్గజం నుంచి ప్రశంసలు పొందిన గాయని సునీత జీవితం ధన్యమే అని చెప్పాలి.