అందరినీ నవ్విస్తూనే ఏడిపించేసిన ఊపిరి సినిమా..!
2016 మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊపిరి సినిమాలో నాగార్జున కార్తీక్ తమన్నా, శ్రేయ, అనుష్క, జయసుధ, ప్రకాష్ రాజ్ అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఊపిరి సినిమా ఫ్రెంచ్ కామెడీ డ్రామా ది ఇన్ టచ్ బుల్(2011)కి రీమేక్ కాగా... వంశీ పైడిపల్లి ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాడు. హీరో కార్తీ పోషించిన శీను జీవితం గురించి, నాగార్జున పోషించిన విక్రమాదిత్య జీవితం గురించి చాలా వివరంగా చూపించాడు వంశీ పైడిపల్లి.
సినిమా కథ గురించి తెలుసుకుంటే... వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న విక్రమాదిత్య ఓ ప్రమాదంలో బాగా గాయపడగా తన శరీరంలో అన్ని అవయవాలు శక్తిని కోల్పోతాయి. ఈ పక్షవాతంతో బాధపడుతున్న అతడు తన పెద్ద ప్యాలెస్ లో ఒంటరిగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. మరోవైపు దొంగతనాలు చేస్తూ జైలుపాలైన శీను జైలు నుండి తాత్కాలికంగా విడుదల అవుతాడు. కానీ తమ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నాడని తన తల్లి అతడిని ఇంటి నుండి గెంటివేస్తుంది. దాంతో తిండి, గుడ్డ, ఆశ్రమం కోల్పోయిన శీను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే విక్రమాదిత్యకి సేవలు చేసేందుకు ఓ పని మనిషి కావాలని తెలుసుకొని అతడు ఇంటికి వెళ్తాడు. అప్పుడే విక్రమాదిత్య సెక్రెటరీ అయిన కీర్తి ని చూసి మనసు పారేసుకుంటాడు శీను. సెలక్షన్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే కీర్తి నెంబర్ కావాలంటూ విక్రమాదిత్య ని అడుగుతాడు శీను.
అతడి ప్రవర్తన చూసి కీర్తి ఆగ్రహించి నువ్వు సెలెక్ట్ కాలేదు ఇక వెళ్ళిపోవచ్చు అని గట్టిగా చెబుతోంది. కానీ విక్రమాదిత్య మాత్రం శీను ని కలెక్ట్ చేస్తాడు. ఇక ఆ క్షణం నుండి విక్రమాదిత్యను పక్షవాతం తో బాధపడుతున్న ఒక రోగ గ్రస్తుడిగా చూడకుండా అతడి జీవితాన్ని సంతోషమయం చేస్తాడు శీను. శీను తన జీవితంలోకి రాకముందు విక్రమాదిత్య అసలు నవ్వే వాడు కాదు. కానీ శీను తన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత అన్ని హాస్యాస్పద సంఘటనలే చోటు చేసుకుంటాయి. అలాగే విక్రమాదిత్య తన గతం గురించి తలచుకునే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఏడిపించేస్తాయి.
ఇటువంటి రోగగ్రస్తుడి పాత్రలో కేవలం తన కళ్ళతో, ముఖకవళికల తో అద్భుతంగా నటించినందుకు గాను నాగార్జునకు మంచి పేరు వచ్చింది. శీను అనే మాస్ క్యారెక్టర్ లో కనిపించిన కార్తీ తన నటనతో అందర్నీ ఫిదా చేశాడు అని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్, కార్తీ మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు అందరినీ కడుపుబ్బ నవ్వించాయని చెప్పుకోవచ్చు. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఏదేమైనా తెలుగులో ఇటువంటి బ్రహ్మాండమైన చిత్రాన్ని చాలా చక్కగా చూపించిన వంశీ పైడిపల్లికి, నాగార్జునకు, కార్తీ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.