ఆ హీరో ' టవల్ ' వేలంపాటలో లక్షలు పలికింది !
కొన్ని సినిమాలు వచ్చి ఎన్నాళ్లయినా.. అందులోని సన్నివేశాలు, పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ చిత్రాల్లోని తారలు ధరించిన దుస్తులు, నగలు.. ఇలా కొన్ని వస్తువులు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలా ఫేమస్ అయిన కొన్నింటిని నిర్మాతలు వేలంవేస్తే, అవి ఊహించని ధరకు అమ్ముడుపోయాయి.
ఒక్కసారి కమిట్ అయితే సినీ అభిమానులు ఎవరి మాట వినరు. అందుకే, తమ అభిమాన తారల సినిమాలు చూడడమే కాదు.. అందులో వాడిన వస్తువులనూ ప్రేమిస్తారు. అలాంటి వాటికి నకిలీలు మార్కెట్లోకొస్తే.. ఎగబడి మరీ సొంతం చేసుకుంటారు. మరి నిజంగా సినిమాల్లో హీరోలు వాడిన వస్తువే వేలానికి పెడితే.. లక్షలు పోసైనా చేజిక్కించుకోరూ? అక్షరాలా అదే చేశారు కొందరు బాలీవుడ్ ఫ్యాన్స్. అలా జరిగిన వేలంలో ఏ వస్తువును ఎంత పెట్టి కొన్నారో తెలుసుకోండి.
'ముజ్సే షాదీ కరోగి' సినిమాలో సల్మాన్ ఖాన్ టవల్ స్టెప్ గుర్తుందా? థియేటర్లలో ఈలలు వేయించిందీ పాట. అయితే అందులో ఉన్న టవల్‌ను ఈబే ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో వేలంవేయగా, రూ.100 విలువైన ఈ వస్తువు.. రూ.1.42 లక్షల పలికింది. ఆ డబ్బును ఓ ఎన్జీవోకు విరాళంగా ఇచ్చింది చిత్ర బృందం.
ప్రియాంకా చోప్రా ఓ సినిమాలో ధరించిన చెప్పుల జత... వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్మేసింది. వచ్చిన ఆ మొత్తాన్ని యునిసెఫ్ 'సేవ్ ద గర్ల్' కార్యక్రమానికి విరాళంగా ఇచ్చింది. ఓసారి ప్రియాంక వేసుకున్న గావిన్ మిగ్యుల్ బ్రాండ్ డ్రెస్ వేలంవేస్తే రూ.1000 నుంచి మొదలై, రూ.50 వేల వద్ద ఆగింది.
ముజాఫర్ అలీ తీసిన 'ఉమ్రావ్ జాన్' చిత్రంలో ఫరూక్ షేక్ నవాబ్ సుల్తాన్ పాత్ర పోషించారు. ఆయన ఎడమచేతి వేలికి పెట్టుకున్న ఓ వెండి ఉంగరాన్ని.. ఓసియన్ ఆక్షన్‌లో వేలం వేయగా, రూ. 96 వేలు పలికింది.
అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా 'లగాన్'(2000). అయితే ఇందులో హీరోగా నటించిన అమిర్ ఖాన్.. చేతితో తయారు చేసిన క్రికెట్ బ్యాటును ఉపయోగించారు. దీనిని వేలం వేయగా అక్షరాల రూ. 1,56,000 పెట్టి ఓ అభిమాని కొనుక్కున్నారు.