అప్పుడు బొద్దు.. ఇప్పుడు సన్నజాజి.. !
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో గానీ.. వెయిట్ మాత్రం తగ్గుతారు. బొద్దుగా కనిపిస్తూ.. చక్కటి కామెడీ టైమింగ్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖను ఇక నుంచి మోటూ.. బోండాం అని సినిమాల్లో పిలవకూడదు. ఒకవేళ ఇలాంటి డైలాగ్స్ రాస్తే.. రాసిన వాళ్లు.. అన్నవాళ్లను చూసి ప్రేక్షకులు నవ్వుతారు. ఇక జీవితంలో తగ్గలేననుకున్న విద్యుల్లేఖ లాక్ డౌన్ పుణ్యమా అని తొమ్మిది కేజీలు తగ్గింది.
విద్యుల్లేఖ సినిమాల్లోనే కాదు బయట కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొంది. ఆమె బొద్దుగా ఉండటం వలనే ప్రత్యేకంగా కామెడీ సీన్స్ రాశారు. బరువు తగ్గాలని చాలాసార్లు అనుకున్నా ఆరోగ్యం సహకరించడం లేదని.. నడుం నొప్పి.. కీళ్ల నొప్పులు.. మరోసారి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ తీసేందుకు ఆపరేషన్ ఇలా వెయిట్ తగ్గుదామనుకున్నా ప్రతీసారి దురదృష్టం వెంటాడిందనీ.. కరోనా టైమ్ కలిసొచ్చి కష్టపడి ఫలితం సాధించానని పోస్ట్ చేసింది విద్యుల్లేఖ.
అధిక బరువుతో నువ్వెలా ఆత్మస్థైర్యంతో ఉండగులుగుతున్నావని చాలామంది తనను అడిగారనీ.. వెయిట్ తగ్గిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చింది ఈ లేడీ కమెడియన్. సాధించలేననుకున్నది సాధించానంటూ.. ఆనందం వ్యక్తం చేసింది. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని తెలిసిందంటోంది.
బరువు తగ్గడానికి రహస్యాలు.. మందులు అవసరం లేదని.. కేవలం శ్రమ చేస్తే చాలని వెయిట్ లాస్ సీక్రెట్ ను బయటపెట్టింది. నేచురోపతి.. ఆయుర్వేదం.. యోగాలను ఫాలో అవుతూ.. కీటోజెనిక్ డైట్ తో ఊబకాయం తగ్గడం మొదలైంది. ఈ ఏడాది జనవరిలో 77కేజీలున్న విద్యుల్లేఖ జూన్ నాటికి 68కేజీలకు వచ్చింది. తొమ్మిది కేజీలు తగ్గి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అప్పటి.. ఇప్పటి ఫోటో చూసిన నెటిజన్లు విద్యుల్లేఖ కష్టాన్ని తెగ మెచ్చేసుకుంటున్నారు. మొత్తానికి విద్యుల్లేఖ డ్రమ్ సైజ్ నుంచి సన్నజాజిలా తయారయింది.