నాగ్‌ సంతోషంకు కారణం?

అక్కినేని నాగార్జునకు గత కొంత కాలంగా ఒక్క సక్సెస్‌ కూడా లేదు. గతంలో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన నాగార్జున సంవత్సరాలుగా సూపర్‌ హిట్‌ కోసం చకోర పక్షిలా వేచి చూస్తున్నాడు. ఈయన ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘భాయ్‌’ చిత్రం విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో నాగార్జున సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ఎట్టకేలకు నాగార్జునకు ‘మనం’ చిత్రంతో ఒక సూపర్‌ హిట్‌ పడబోతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన ‘మనం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ తాజాగా యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగేశ్వరావు చివరి చిత్రం కావడంతో పాటు అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలతో పాటు భారీ ఆసక్తి ఉంది. దాంతో చిత్ర ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ను సాధించింది. దాంతో నాగార్జున ఈ చిత్రంపై ఫుల్‌ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్‌ ‘మనం’తో రావడం ఖాయం అని ఈ మన్మధుడు భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెంచేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, శృతిహాసన్‌ జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేసుగుర్రం’ చిత్రం మధ్యలో ‘మనం’ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు సిద్దం అవుతున్నారు. ‘రేసుగుర్రం’ ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్స్‌లో కూడా ‘మనం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ‘మనం’ చిత్రంను వచ్చే నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: