ఓటీటీ వైపు హీరోలు, నిర్మాతల మనసు.. !
చిన్న సినిమాలకే కాదు.. మీడియం బడ్జెట్ మూవీస్ కు కూడా ఓటీటీ దిక్కవుతుందా.. కరోనా విలయ తాండవం చూస్తుంటే.. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావడం కాదు కదా.. షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓటీటీ వద్దు థియేటర్స్ ముద్దు అని భీష్మించుకు కూర్చున్న హీరోల..నిర్మాతల మనసు ఓటీటీ వైపు మళ్లుతోంది.
నాలుగైదు కోట్ల నుంచి 10కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలకు ఓటీటీ తప్ప మరో ఆప్షన్ లేదు. ఈ క్రమంలో అమృతరామమ్.. కృష్ణ అండ్ హిస్ లీల.. పెంగ్విన్.. భానుమతి రామకృష్ణ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. ఇవన్నీ 10కోట్ల లోపు బడ్జెట్ సినిమాలే. అయితే వీటిలో కొన్ని థియేటర్స్ ఓపెన్ కోసం వెయిట్ చేశాయి. ఇప్పట్లో ఇది కుదరకపోవడంతో.. ఓటీటీ వైపు చూస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఓటీటీలో రిలీజయ్యే అవకాశముంది.
థియేటర్స్ లో తమ బొమ్మ చూసుకోవాలని డెబ్యూ హీరోలు చాలా కాలంగా కలలు కంటూ ఉంటారు. వీళ్ల కలను కరోనా దెబ్బ కొడుతోంది. బుల్లితెర యాంకర్ ప్రదీప్ తెరపైకి రాలేకపోయినట్టే.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ఉప్పెన షూటింగ్ పూర్తి చేసుకొని.. థియేటర్స్ లో రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఓటీటీ ఆప్షన్ మొదట్లో వద్దనుకున్నా.. ఇప్పుడిదే పెద్ద దిక్కుగా మారింది.
డాన్ శ్రీను.. బలుపు లాంటి హిట్స్ తర్వాత రవితేజ.. దర్శకుడు గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం క్రాక్. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. అని వెయిట్ చేసిన క్రాంక్ టీమ్ పై కరోనా నీళ్లు చల్లింది. ఓ ఓటీటీ ఫ్యాన్స్ ఆఫర్ ఇవ్వడంతో.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట.
పూరీ వారసుడు ఆకాశ్ నటించిన సినిమా రొమాంటిక్ కూడా ఓటీటీవైపే చూస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేస్తే.. ఓటీటీ రైట్స్ కూడా తగ్గిపోతాయన్న భయం పూరీలో ఉంది.