బాబుకు ఆయన హ్యాండు బాగానే కలిసొచ్చిందే....??
సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి, చిన్నతనంలోనే తన నటనతో ప్రేక్షకుల నుండి మంచి మార్కులు సంపాదించారు. ఆపై బాలచంద్రుడు సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు విరామం ఇచ్చిన మహేష్, ఆ తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, సి అశ్వినీదత్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఫస్ట్ సినిమాతోనే మహేష్ కు ప్రిన్స్ గా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో, పలు సక్సెస్ లతో దూసుకెళ్లిన మహేష్ బాబు, కెరీర్ పరంగా ఎన్నో అద్భుత విజయాలు అందుకుని, తండ్రి కృష్ణ మాదిరిగా టాలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి పేరు గడించారు.
ఒకసారి మహేష్ బాబు కెరీర్ ని పరిశీలిస్తే, ఆయన సక్సెస్ లు అందుకున్న దాదాపుగా చాలా సినిమాల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఉండి తీరుతారు. ముందుగా మహేష్ నటించిన రాజకుమారుడులో ఆయన మావయ్యగా నటించిన ప్రకాష్ రాజ్, ఆ తరువాత మురారిలో ఒక చిన్నపాత్రలో నటించారు. ఆపై వచ్చిన బాబీ, ఒక్కడు సినిమాల్లో విలన్ గా నటించారు. తరువాత నిజం, అర్జున్, అతడు, సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, పోకిరిలో కూడా విలన్ గా నటించారు. వాటి అనంతరం సైనికుడులో ఒక కీలక పాత్రలో కనపడగా, దాని తరువాత వచ్చిన ఖలేజాలో కూడా విలన్ గా నటించారు.
అనంతరం దూకుడులో మహేష్ తండ్రిగా, బిజినెస్ మ్యాన్ లో విలన్ గా, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో ఆయనకు తండ్రిగా, అలానే భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో కూడా మరొక్కసారి విలన్ గా నటించి మెప్పించారు. కాగా వీటిలో చాలావరకు సినిమాలు అద్భుత విజయాలు అందుకోగా బాబీ, నిజం, సైనికుడు, ఖలేజా సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు. ఇలా మొత్తంగా చూసుకుంటే ప్రకాష్ రాజ్, హ్యాండు చాలావరకు సూపర్ స్టార్ మహేష్ కు కలిసి వచ్చినట్లే అని అంటున్నారు విశ్లేషకులు....!!