తల్లి విజయనిర్మల కోసం నరేష్ ఏం చేశాడో తెలుసా..?
ఈ సృష్టిలో అమ్మ ప్రేమ కన్నా.. అద్భుతమైనది, మధురమైనది ఏది లేదు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే అంటారు. అది అక్షరాల నిజం. అక్కున చేర్చుకొని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది, చేతల్లో రాయలేనిది. ఇక మనం ఎదుగుతూ ఎన్ని శిఖరాలను అందుకున్నా.. అమ్మ ముందు ఎప్పుడూ చిన్న పిల్లలమే. అమ్మ యావత్ విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమ జ్యోతి.
మరి అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే, తన నుంచి దూరమైన తన తల్లికి బంగారు పాదాలు చేయించి వాటిలో తన తల్లిని చూసుకుని పూజిస్తున్నారు ప్రముఖ నటుడు వీకే నరేష్. సినీ నటి, లెజండరీ దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత విజయనిర్మల నటుడు నరేష్‌కి తల్లి అవుతారన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నరేష్ నటుడిగా నిలదొక్కుకోవడానికి, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి.. ఆయన తల్లి విజయనిర్మల ఎంతో కృషి చేశారు. అయితే గత ఏడాది విజయనిర్మల అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణం సినీ పరిశ్రమను, ప్రేక్షకులను విషాదంలో ముంచెత్తింది.
200 లకు పైగా చిత్రాల్లో నటించి హీరోయిన్గా, 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకురాలిగా కీర్తి గడించిన విజయనిర్మల మరణం.. ఆమె కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇక ఇటీవల విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. అయితే అదే సమయంలో కాంస్య విగ్రహంతో పాటు నరేష్ చేయించిన విజయనిర్మల బంగారు పాదాలను కూడా ఆవిష్కరించారు. ఈ పాదాలను తల్లి విగ్రహం వద్దే అద్దాల పెట్టెలో ఉంచి.. తనకు తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు నరేష్.