హాస్యనటిగా అనిర్వచనీయ ప్రతిభను కనబరిచిన నటి రమాప్రభ.. !!
నవ్వడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన కష్టాల్ని, బాధల్ని అన్ని మరిచిపోయి తనివి తీరా నవ్వితే చాలు మనసుకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. నవ్వడం అనేది అందరం చేస్తాము కానీ నవ్వించడం మాత్రం కొంతమందికే సాధ్యం. అలాంటి కోవలో రమాప్రభ గారు ముందు ఉంటారు.తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప నటీమణుల్లో రమాప్రభ ఒకరు. సినిమాల్లోకి రాకముందు రమాప్రభ నాటకాలలో నటించారు. నటన అంటే రమాప్రభకు ఎంతో ఇష్టం. ఎంత పెద్ద డైలాగు చెప్పినా రమాప్రభ ఎంతో సులభంగా చెప్పేవారు. రమాప్రభ షూటింగ్ టైంలో తోటి నటీనటులతో సరదాగా ఉండేవారు. సరదాగా, జాలీగా అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడడం రమాప్రభకు అలవాటు.
నవ్వించడంలో,ముఖంలో హావ భావాలు ప్రదర్శించడంలో ఆవిడకు సాటి ఎవరు రారు. నవ్వు...నవ్వించు... ఆ నవ్వుల్ని నలుగురికి పంచు...అనే సిద్ధాంతాన్నే జీవితంగా మలచుకున్న హాస్య నటి మన రమాప్రభ. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళా హాస్య నటిమణులు కొంచెం తక్కువే. అయిన గాని రమాప్రభ తెలుగు హాస్య సినిమా నటిగా చాల పేరు తెచ్చుకున్నారు. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది. చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో సినిమా రంగంలోకి వచ్చారు . హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజిబాబు వంటి నటులకు జోడీగా నటించింది.
తెర మీద రాజీబాబు, రమాప్రభ నటిస్తే చాలు హాస్యానికి హద్దులు ఉండవు. పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య మొదలగు హాస్యనటుల కాంబినేషన్లో నవ్వులను పండించిన నటి రమాప్రభ.వయసు పై బడినా గాని హాస్యాన్ని పండించడంలో ఏ మాత్రం తీసిపోరు.బడి పంతులు,సంబరాల రాంబాబు, అక్కా చెల్లెల్లు, బొమ్మ బొరుసా, విచిత్ర బంధం, తాతా మనవడు, ఇద్దరు అమ్మాయిలు, పట్నం వచ్చిన పతివ్రతలు, దేశముదురు ఇలా ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారు . రమాప్రభ హీరోయిన్ల పాత్రలకు దూరంగా ఉండడానికి మరొక కారణం కూడా ఉంది. హీరోయిన్ పాత్రలైతే, కేవలం అవి మాత్రమే వస్తాయని, అలాగే కొంతకాలానికే వెండి తెరకు దూరంగా ఉండాలని తెలిసినవారు రమాప్రభకు చెప్పారట. ఈ కారణంగా కూడా హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉన్నారట రమాప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పాత్రలు చేయడం వలనే ఇంత కాలం ఇండస్ట్రీలో కంటిన్యూ అవగలుగుతున్నానని కూడా రమాప్రభ ఒకానొక సందర్భంలో తెలిపారు.