తండ్రి దేవదాస్ కనకాల గురించి ట్విట్టర్ లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన రాజీవ్ కనకాల..!

Suma Kallamadi

రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకి నటన నేర్పిన నట శిక్షకుడు దేవదాస్ కనకాల 2019 ఆగస్టు రెండవ తేదీన హైదరాబాద్ నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 74 ఏళ్ల వయసులో కన్నుమూశారు. దీంతో యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అతని మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులంతా సోషల్ మీడియా లో సంతాపం తెలిపారు. తండ్రి చనిపోయినప్పుడు కుమారుడైన రాజీవ్ కనకాల శోకసంద్రంలో మునిగిపోయాడు. దేవదాస్ కనకాల చనిపోయి దాదాపు సంవత్సరం కావస్తోంది.  


దేవదాసు కనకాల కుటుంబంలో అందరూ నటీనటులే. భార్య లక్ష్మి కనకాల కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2018 వ సంవత్సరం లో మరణించారు. అప్పట్లో కూడా రాజీవ్ కనకాల తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయాడు. అతని సోదరి మణి శ్రీ లక్ష్మీ కనకాల కూడా క్యాన్సర్ వ్యాధితో ఇటీవలే చనిపోయారు. దీంతో రాజీవ్ కనకాల ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. గత మూడు సంవత్సరాల్లో రాజీవ్ కనకాల తనకిష్టమైన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయాడు. అయితే తాజాగా అతను తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. ట్విట్టర్ వేదికగా తన తండ్రి ఫోటో పోస్ట్ చేసి ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. 


ఆ పోస్ట్ లో రాజీవ్ కనకాల... 'ఒక్క సంవత్సరం ఒక గడియలా (యుగంలా) గడిచిపోయింది. తన సంతోషంతో పాటు తన చుట్టూ ఉన్న వారి సంతోషాన్ని ప్రతి క్షణం కోరుకునేవారు. నాకు స్ఫూర్తి దాయకమైన మార్గదర్శనం నా తండ్రి శ్రీ దేవదాస్ కనకాల గారు. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని నా ప్రార్థన. దేవదాస్ కనకాల గారు', అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: