వారికి మాత్రం సోనూ సూద్ ఇంకా విలనే.. !
సినిమాల్లో విలన్ వేషాలు వేసినా, లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా మారారు సోనూ సూద్. లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులను జాగ్రత్తగా స్వస్థలాలకు చేరుస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకరకంగా బాలీవుడ్ హీరోలందరూ సోనూ సూద్ ముందు దిగదుడుపేనని అన్నారంతా. అయితే ఇప్పుడు సోనూ వల్ల నేరుగా తెలుగు హీరోలు లాక్ అయిపోయారు. చిత్తూరు జిల్లా రైతుకి లక్షల రూపాయల విలువ చేసే ట్రాక్టర్ ని కొనిచ్చి, అది కూడా సమస్య తన దృష్టికి వచ్చిన 24గంటల్లో ఆ కుటుంబానికి న్యాయం చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. దీంతో పరోక్షంగా తెలుగు హీరోలంతా అభిమానులకు టార్గెట్ అయ్యేలా చేశారు. "సినీ పరిశ్రమలో ఇంతమంది పెద్ద హీరోలున్నారు, కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు, మీరెప్పుడైనా ఇలా స్పందించారా" అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
సోనూ సూద్ ని చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి కరోనా కష్టకాలంలో తెలుగు హీరోలు తలో చెయ్యి వేసి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో సినీరంగంలోని పేదలను ఆదుకున్నారు. వారికి నిత్యావసరాలు సమకూర్చి తమ పెద్దమనసు చాటుకున్నారు. ఒకరిద్దరు కేవలం సినీ రంగం తోటే సరిపెట్టకుండా సీఎం సహాయనిధి, పీఎం కేర్స్ కి కూడా విరాళాలు ప్రకటించారు. అంతే, వారి పని అక్కడితో అయిపోయింది. అయితే ఇలా నేరుగా సమస్యలను పరిష్కరించే స్థాయిలో ఎవరూ ప్రయత్నాలు చేయలేదనేది మాత్రం వాస్తవం. కొంతమంది తెలుగు హీరోలు అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు ఆర్థిక సాయం చేసారు కానీ, సోనూ సూద్ కి వచ్చినంత పేరు, పబ్లిసిటీ వారికి రాలేదనే చెప్పాలి.
ప్రస్తుతం సోనూ.. టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. సోషల్ మీడియాలో ఆయన్ని దేవుడిలా కొలుస్తున్నారు నెటిజన్లు. అక్కడితో ఆగితే పర్లేదు, కానీ హీరోలను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. సోనూ సూద్ కి ఉన్నంత సేవా నిరతి తెలుగు హీరోలకు లేదంటూ తిట్టిపోస్తున్నారు. ఒకరకంగా తను చేసిన సాయంతో ప్రజలకు దేవుడిలా మారిన సోనూ.. తెలుగు హీరోలకు మరోసారి విలన్ గా మారారనడంలో ఆశ్చర్యంలేదు. ఆయన చేసిన మంచిపనికి అనవసరంగా తెలుగు స్టార్ హీరోలు నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసి కలెక్షన్లు తెచ్చుకునే హీరోలెవరూ నిజంగా రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకోవడంలేదని, సోషల్ మీడియాలో తెలుగు హీరోలపై విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి