మళ్ళీ మేడమే కావాలంటున్న బన్నీ .....??
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత గీత ఆర్ట్స్ 2 బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వారు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న సినిమాలో బన్నీ నటించనున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతూ, ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య మూవీ తీస్తున్న కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఒక మంచి సోషల్ మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా కథను సిద్ధం చేసాడట దర్శకుడు కొరటాల. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇటీవల పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి.
అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల బన్నీ తో కలిసి నటించిన అలవైకుంఠపురములో సినిమాలో ఆయనకు మేడమ్ పాత్రలో పూజా హెగ్డే నటించింది. అయితే ఈసారి కూడా ఆమె అయితేనే ఈ సినిమాలోని పాత్రను పోషించగలదు అని భావించి ఆమె పేరుని దర్శకుడు కొరటాలకు బన్నీ సూచించినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం బన్నీ, పూజా హెగ్డే ల జోడీ ని మరొక్కసారి తెరపై చూడవచ్చన్నమాట .....!!