అల్లు అర్జున్ ఏది చేసినా వెరైటీగా చేస్తారనే పేరుంది. టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా అందరి దృష్టినీ ఆకర్షించిన అల్లువారబ్బాయి, సినిమాల ఎంపికలో కూడా తనదైన మార్క్ చూపిస్తారు. ఇక స్టైల్ స్టేట్ మెంట్ అంటారా.. టాలీవుడ్ లో స్టైల్ కి మారుపేరులా నిలిచారు అల్లు అర్జున్. అందుకే అభిమానులంతా స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటి స్టైలిష్ స్టార్ కి ప్రకృతిలోకి వెళ్లడం అంటే బాగా ఇష్టం. అందులోనూ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రకృతి అందాలు చూసేందుకు తరచూ టూర్లకు వెళ్తుంటారు అల్లు అర్జున్. కరోనా కారణంగా ఇటీవల బైటకు వెళ్లేందుకు కుదరలేదు. అటు షూటింగ్ లు కూడా లేవు. దీంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాలను చుట్టివచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు అల్లు అర్జున్.
ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని కుటుంబ సభ్యులతో కలసి చూసి వచ్చారు అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ విహార యాత్ర కాస్తా విమర్శలకు దారి తీసింది. అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినంత మాత్రాన రూల్స్ వర్తించవా అని సామాన్య ప్రజలు , పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారుల అత్యుత్సాహంపై వారు మండిపడుతున్నారు. సినీ హీరో కావడంతో అటవీశాఖ అధికారులు దగ్గరుండి కుంటా జలపాతానికి అల్లు అర్జున్ ని తమ జీప్ లో తీసుకెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ ఆదిలాబాద్ పట్టణ శివారులోని హరితవనం పార్కులోని సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్‌తో హరితవనం పార్కులో అటవీ అధికారులు మొక్కలు నాటించారు. అల్లు అర్జున్ రాక గురించి తెలియడంతో అభిమానులు తెగ హడావిడి చేశారు. ఆయన ఫొటోలు తీసి క్షణాల్లో ఇంటర్నెట్ లో పెట్టారు. పుష్ప సినిమాకోసం కొత్త లుక్ ట్రైచేసిన బన్నీ, అదే గెటప్ లో బైటకు రావడంతో అభిమానులు చుట్టుముట్టారు. పుష్ప గెటప్ అదుర్స్ అంటూ హడావిడి చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. సామాన్యులకు లేని అనుమతులు సినిమావాళ్లకు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు నెటిజన్లు. కరోనా కారణంగా ఆంక్షలు అమలవుతున్నా సెలబ్రిటీలను అధికారులు దగ్గరుండి మరీ తీసుకెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి సామాన్యులను, పర్యాటకులను మాత్రం కరోనా సాకు చూపి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం, సామాన్యులు, పర్యాటకులను మాత్రం రూల్స్ పేరుతో నిలువరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పుష్పా.. నీకిది తగునా అంటున్నారు.