టీవీ ఆర్టిస్ట్ శ్రావణి ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుళ్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయిలను కాసేపటి క్రితం పోలీసులు అధికారికంగా అరెస్ట్ చూపించారు. విచారణలో భాగంగా శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి, దేవరాజ్ స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజీతో పాటు, శ్రావణితో దేవరాజ్, సాయి జరిపిన సంభాషణలు కూడా కీలకంగా మారాయి. దీంతో పోలీసులు ఈ ఆధారాలన్నిటినీ సేకరించారు. వీటిని ముందు పెట్టుకునే దేవరాజ్, సాయిలను ప్రశ్నించారు.
శ్రావణి ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. శ్రావణి చనిపోగానే ఆమె ఆత్మహత్యకు దేవరాజే కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులకు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. దేవరాజ్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అన్నారు శ్రావణి తల్లిదండ్రులు. తమ కుమార్తె ఫోన్ ని కూడా దేవరాజ్ దొంగతనంగా ఉపయోగించేవాడని, ఆమెకు తెలిసినవారికి ఫోన్లు చేసేవాడని చెప్పారు. అయితే దేవరాజ్ మాత్రం శ్రావణి కుటుంబ సభ్యుల వాదనను ఖండించాడు. సాయి వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నాడు. తన వాదనకు బలం చేకూర్చే ఆడియో, వీడియో సాక్ష్యాలను పోలీసులకు దేవరాజ్ ఇప్పటికే అందించాడు.
కేసు విచారణలో భాగంగా ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సాయి, దేవరాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పలు దఫాలుగా వీరివద్ద సమాచారం సేకరించారు. విడివిడిగా ఓసారి, ఇద్దరినీ కలిపి మరోసారి విచారణ జరిపి నిజానిజాలు రాబట్టారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుండడంతో అసలు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ కేసులో ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డిని సోమవారం పోలీసులు విచారించే అవకాశం ఉంది. దేవరాజ్, సాయి, అశోక్‌రెడ్డి లను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే పూర్తిస్థాయిలో శ్రావణి ఆత్మహత్యకు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలంటున్నాయి.