అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం మద్రాస్ లో నివాసం ఉన్నారు. అప్పట్లో ఇండస్ట్రీని మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలించడంలో నాగేశ్వరరావు పాత్ర చాలా కీలకం అంటారు. అలా హైదరాబాద్ తరలి వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు ఏఎన్ఆర్. అయితే సినిమాలతోపాటు అప్పట్లో అక్కినేని ఫ్యామిలీ ఇతర వ్యాపారాలు కూడా చేసేదట. ఆ విషయాన్ని నాగార్జున ఇటీవల బైటపెట్టారు.
ఇంతకీ నాగార్జున ఏమన్నారంటే.."మా నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. 1963లో హైదరాబాద్ ఓ పెద్ద గ్రామంలా ఉండేది. అప్పట్లో నాన్నగారు ట్యాంక్ బండ్ వెనక 8 ఎకరాల స్థలం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్ మా ఇంటికి ఆనుకొని ఉండేది. సరిగ్గా అప్పుడే ప్రకృతితో ప్రేమలో పడ్డాను. ఆ 8 ఎకరాల్లోనే మాకు పశువుల కొట్టం, వరి చేలు, పౌల్ట్రీ ఫామ్, కూరగాయలు పండించే స్థలం.. ఇలా అన్నీ ఉండేవి. ఓ చిన్నపాటి చెరువు తవ్వి అందులో చేపలు కూడా పెంచేవాళ్లం. కావాల్సినప్పుడు ఆ చేపలు పట్టుకొని వండుకొని తినడమే." అంటూ తన చిన్ననాటి మధుర స్మృతుల్ని షేర్ చేసుకున్నాడు నాగ్. చిన్నప్పుడు తను తిన్న ప్రతి పదార్థం తన కళ్లముందే పెరిగిందని.. పైగా దాన్ని తనే పండించడం చాలా ఆనందంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆవుల్ని కడగడం, పాలు పితకడం కూడా తనే చేశానని చెప్పుకొచ్చారు. అలా తానో రైతు బిడ్డలా పెరిగానని చెప్పారు నాగార్జున.
అంటే అప్పట్లో అక్కినేని కుటుంబానికి పౌల్ట్రీఫామ్, పశువుల పెంపకం, పంటలు పండించడం ఓ వ్యాపకంలా ఉండేదని అర్థమవుతోంది. దాంతోపాటు చిన్నపాటి చేపల చెరువులు కూడా ఉండేవని తెలుస్తోంది. అయితే ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న ఆ 8 ఎకరాల స్థలం ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీతోనే ఉందా, లేకపోతే దాన్ని అమ్మేశారా అనే విషయాన్ని మాత్రం నాగార్జున బైటపెట్టలేదు. నటుడిగా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడంతోపాటు.. నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు నాగార్జున. అన్నపూర్ణ బ్యానర్ ని కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు కొన్నాళ్లు టీవీ ఛానెల్ లో కూడా భాగస్వామిగా ఉన్నారు.