ఆ రెండూ చూసి భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానంటున్న వెంకటేష్..
చంటి లాంటి సినిమాలయినా, సరదాగా సాగిపోయే.. నువ్వునాకు నచ్చావ్ లాంటి సినిమాలయినా వెంకటేష్ కి కొట్టినపిండి. అయితే ఇప్పుడు ఎంటర్టైన్ మెంట్ కే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇటీవల వెంకటేష్ చేసిన ఎఫ్-2 సినిమానే దీనికి ఉదాహరణ. భారీ చిత్రాలను సైతం తలదన్ని ఎఫ్-2 కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. అయితే వెంకటేష్ అదే జానర్ లో వెళ్లాలా లేక, స్టైల్ మార్చాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఎఫ్-3 సినిమా స్క్రిప్ట్ వర్క ఇటీవలే పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫైనల్ స్క్రిప్టుకి వెంకీ.. వరుణ్ తేజ్ ఇద్దరూ ఓకే చెప్పారట. డిసెంబరు 14న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మొదటి షెడ్యూల్ లోనే ఇద్దరు హీరోలు పాల్గొంటారని చెబుతున్నారు. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. వచ్చే వేసవి నాటికి ఈ సినిమా థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.