‘రాంబాబు’పై పెరుగుతున్న ‘అనుమానాలు’

Prasad
గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాపై ఎంతగా అంచనాలు ఉన్నాయో, అంతకంటే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా సినిమాలు చేసే అలవాటు ఉన్న పూరీ జగన్నాథ్ ఈ ‘రాంబాబు’ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ ను మొదటగా రవితేజకు వినిపించాను. కథ విన్న రవితేజ ఈ కథ నాకంటే పవన్ కళ్యాణ్ కు సూట్ అవుతుందని చెప్పాడు. దీంతో ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పాని’ అన్నాడు. అసలే, ఈ కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాపై ఫిల్మ్ నగర్ లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూరీ ఈ సినిమాను చుట్టేశాడని, దీంతో ఈ సినిమాను హరీష్ శంకర్ తో రీషూట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో కొంత మంది చెబుతున్నారు. అలాగే, పారితోషకం విషయంలో నిర్మాతతో పూరీ గొడవ పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అంశాలతోనే ఈ రాంబాబు పై సినిమా వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు... మంగళవారం నాడు పూరీ చెప్పిన మాటలుతో రాంబాబుపై ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. అసలే రవితేజ ప్లాపుల్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ మంచి కథ చెప్పితే వదులుకునే అమాయకుడు కాదు. మంచి అవకాశాన్ని పొగొట్టుకునేంత ‘ఇడియట్’ కాదు. దీంతో కథ మంచిదయితే రవితేజ ఈ చాన్స్ ఎందుకు వదులుకుంటాడని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చాలా మంది చర్చించుకుంటున్నారు. దేవుడు చేసిన మనుషులు విడుదల సమయంలోనూ పూరీ ఈ విధంగానే ‘సినిమాలో కథ లేదు’ అంటూ మాట్లాడాడు. ఇప్పుడు ఈ రాంబాబు కథను ముందుగా వేరే హీరోకు చెప్పానంటున్నాడు. దీంతో కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, ఇటీవల కాలంలో పూరీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. బిజినెస్ మాన్ తప్పించి మిగిలిన సినిమాలు ప్లాపులు గా పేరుతెచ్చుకున్నాయి. దీంతో, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రమే ఈ రాంబాబును గట్టెక్కించాలని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: